కోనసీమ జిల్లాకు అంబేడ్కర్ పేరు పెట్టడంతో అమలాపురం అట్టడుకుతోంది. ఈ అంశంపై పెద్ద ఎత్తున ఆందోళనకారులు నిరసనలకు దిగడంతో ఎస్పీ ఆధ్వర్యంలో అమలాపురం చేరుకున్న పోలీసులు ఆందోళనకారులను అడ్డుకున్నారు. ఎక్కడికక్కడ పోలీసులు అరెస్టులు చేస్తుండటంతో నిరసనకారులు రెచ్చిపోయారు. పోలీసులపైకి రాళ్లు రువ్వారు. ఈక్రమంలోనే మొత్తం ఐదు బస్సులు, పోలీసు వాహనాలకు ఆందోళనకారులు నిప్పంటించారు. తర్వాత నిరసనకారులు మంత్రి విశ్వరూప్ ఇంటిని, ఆవరణలో ఉన్న కార్లను తగులబెట్టారు. దీంతో అమలాపురంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
కాగా ఆందోళనకారులు తన ఇంటికి నిప్పు పెట్టడంపై మంత్రి విశ్వరూప్ స్పందించారు. నిరసనకారులు తన ఇంటిని తగులబెట్టడం దురదృష్టకరమన్నారు. జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టడం గర్వకారణమని.. అయితే టీడీపీ, జనసేన, బీజేపీ డిమాండ్ చేస్తేనే అంబేద్కర్ పేరు పెట్టినట్లు మంత్రి విశ్వరూప్ గుర్తుచేశారు. ఇప్పుడు ఆ పార్టీలు మాట మార్చాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయా పార్టీలు యువతను రెచ్చగొట్టి పబ్బం గడుపుకుంటున్నాని ఆరోపించారు. అయితే ప్రజలు శాంతియుతంగా నిరసనలు తెలిపాలని.. వారికి ఏవైనా అభ్యంతరాలు ఉంటే పరిశీలిస్తామని మంత్రి విశ్వరూప్ సూచించారు.