Andhra Pradesh: అనకాపల్లి జిల్లా యలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబుకు మరోసారి నిరసన తగిలింది. ఎమ్మెల్యే కన్నబాబు చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని దొప్పెర్ల గ్రామస్థులు అడ్డుకున్నారు. ప్రభుత్వ పథకాల అమలు విషయంలో ఎమ్మెల్యే వివక్ష చూపిస్తున్నారంటూ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కన్నబాబు వద్దు-జగనన్న ముద్దు అంటూ నినాదాలు చేశారు. కన్నబాబు అరాచకాలు సీఎం జగన్ వరకు చేరాలని.. కన్నబాబు అరాచకాలు నశించాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఎమ్మెల్యే కన్నబాబు రాజుతో దొప్పెర్ల గ్రామస్తులు తీవ్ర వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా ఉద్రిక్తత చోటు చేసుకోవడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. దీంతో పోలీసులు, దొప్పెర్ల గ్రామస్తులకు మధ్య తోపులాట జరిగింది. కన్నబాబు దిష్టిబొమ్మ దహనం చేసేందుకు గ్రామస్తులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.
అటు కర్నూలు జిల్లా ఆదోనిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే సాయి ప్రసాద్‌రెడ్డికి కూడా చేదు అనుభవం ఎదురైంది. పట్టణంలోని 2వ వార్డులో లబ్దిదారులకు ప్రభుత్వం నుంచి వచ్చిన సంక్షేమ పథకాలను ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి వివరించారు. చిన్న గుడిసెకు రూ.1600 ఇంటి పన్ను వస్తుందని శ్రీనివాస్ అనే వ్యక్తి ఎమ్మెల్యేను ప్రశ్నించారు. సంక్షేమ పథకాలు వస్తున్నాయి కదా అని ఎమ్మెల్యే అడగ్గా.. తాము కట్టిన పన్నుల వల్లే కదా పథకాలు ఇస్తున్నారని ఆ వ్యక్తి సమాధానం ఇచ్చాడు. బాధితుడు ఇంటి, చెత్త పన్ను తగ్గించాలని కోరగా.. అలా కుదరదని ఎమ్మెల్యే అక్కడ నుంచి వెళ్లిపోయారు.
Read Also: Hyderabad: పార్కులకు వెళ్లే లవర్స్‌కు చేదువార్త.. ఆ పని చేస్తే దొరికిపోతారు