prime minister narendra modi andhra pradesh tour live updates
మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకలకు భీమవరం ముస్తాబైంది. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్నారు. ఈ సందర్భంగా అల్లూరి సీతారామరాజు 30 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. అనంతరం భీమవరానికి సమీపంలోని కాళ్ల మండలం పెద అమిరంలో జరిగే భారీ బహిరంగసభలో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. ఈ సభలో ప్రధాని మోదీతో పాటు గవర్నర్ హరిచందన్, సీఎం జగన్, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి, పురంధేశ్వరి, సోము వీర్రాజు, నిమ్మల రామానాయుడు, అల్లూరు ఆర్గనైజేషన్ కమిటీ, వసుధ ఫౌండేషన్ ప్రతినిధులు, మంతెన వెంకట రామరాజు, పేరిచర్ల రాజు పాల్గొననున్నారు.
ప్రధాని మోదీ ఏపీ పర్యటన ముగిసింది. ఈ మేరకు గన్నవరం ఎయిర్ పోర్టులో ప్రధాని మోదీకి గవర్నర్ హరిచందన్, సీఎం జగన్ వీడ్కోలు పలికారు.
పెద అమీరం సభా వేదికపై ప్రధాని తన ప్రసంగం పూర్తి చేసిన అనంతరం మోదీ, సీఎం జగన్‌లతో మంత్రి రోజా ప్రత్యేకంగా సెల్ఫీ తీసుకున్నారు.
ఏడాది పాటు అల్లూరి జయంతి, రంప పోరాటం ఉత్సవాలు నిర్వహిస్తామని ప్రధాని మోదీ వెల్లడించారు. ఆదీవాసీల అభివృద్ధికి ప్రభుత్వం కృషిచేస్తోందని.. భారతదేశం భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనమని మోదీ పేర్కొన్నారు.
ఏపీలో ఎందరో స్వాత్రంత్ర్య వీరులు ఉన్నారని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. పింగళి వెంకయ్య, కందూకురి వీరేశలింగం, ప్రకాశం పంతులు ఏపీవారేనని.. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బ్రిటిష్ వారిని ఎదిరించి పోరాడారని.. స్వాతంత్ర్య సంగ్రామ మూలాలు అన్ని ప్రాంతాల్లో ఉన్నాయని మోదీ గుర్తుచేశారు.
అల్లూరి సీతారామరాజు తన జీవితాన్ని దేశం కోసం అంకితం చేశారని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. స్వాతంత్ర సమరయోధుల కలలను సాకారం చేయాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. మనదే రాజ్యం నినాదంతో ప్రజలను అల్లూరి సీతారామరాజు ఏకతాటిపైకి తెచ్చారని గుర్తుచేశారు. చిన్న వయస్సులోనే బ్రిటీష్ వారిపై తిరగబడ్డారని.. ఆదివాసీల శౌర్యం, ధైర్యానికి అల్లూరి ప్రతీక అని మోదీ అన్నారు. అల్లూరితో కలిసి ఎందరో యువకులు బ్రిటీష్ వారిపై పోరాడారని.. అల్లూరి జీవన ప్రస్థానం అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు.
మొగల్లులో ధ్యానమందిరం, చింతపల్లి పోలీస్ స్టేషన్‌ను అభివృద్ధి చేస్తామని.. అల్లూరికి సంబంధించిన అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని ప్రధాని మోదీ ప్రకటించారు. రంప ఆందోళన ప్రారంభించి నేటికి వందేళ్లు పూర్తయిందన్నారు. లంబసింగిలో అల్లూరి సీతారామరాజు మెమోరియల్, గిరిజన మ్యూజియం నిర్మిస్తామని.. విశాఖలో ట్రైబల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఏర్పాటు చేస్తామని.. మన్యం జిల్లాలను అభివృద్ధి చేస్తామని. అల్లూరిని స్ఫూర్తిగా తీసుకుని ముందుకెళ్తే ఎవరూ ఆపలేరని మోదీ అభిప్రాయపడ్డారు.
మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాలు జరుపుకోవడం సంతోషంగా ఉందని ప్రధాని మోదీ అన్నారు. యావత్ భారత్ తరఫున అల్లూరి పాదాలకు వందనం చేస్తున్నట్లు పేర్కొన్నారు. అల్లూరి కుటుంబాన్ని సత్కరించడం తన అదృష్టమన్నారు. స్వాతంత్ర్య సాధనలో అల్లూరి పోరాట పటిమ అందరికి తెలియాలని.. ఆ స్ఫూర్తికోసమే ఆజాదీకా అమృత్ మహోత్సవ్ వేడుకలు జరుపుకుంటున్నామని ప్రధాని తెలిపారు. దేశం కోసం ఎందరో మహానుభావులు త్యాగం చేశారని.. వారి త్యాగాలను స్మరించుకోవాలని మోదీ సూచించారు.
ఆంధ్ర రాష్ట్రం ఒక పుణ్యభూమి.. వీరభూమి.. అల్లూరి సీతారామరాజు మన్యం వీరుడు, తెలుగు జాతి యుగపురుషుడు.. యువ భారతానికి అల్లూరి స్ఫూర్తిదాయకం అని ప్రధాని మోదీ వెల్లడించారు.
తెలుగువీర లేవరా.. దీక్షబూని సాగరా అంటూ ప్రధాని మోదీ తన ప్రసంగం ప్రారంభించారు. మన నాయకుడు అల్లూరి సీతారామరాజు పుట్టిన ఈ నేలపై మనమందరం కలుసుకోవడం చాలా ఆనందంగా ఉందని ప్రధాని మోదీ తెలుగులో మాట్లాడారు.
లక్షలాది మంది త్యాగాల ఫలితమే నేటి భారతదేశమని సీఎం జగన్ అన్నారు. పోరాట యోధుల్లో మహా అగ్నికణం అల్లూరి సీతారామరాజు అని పేర్కొన్నారు. తెలుగు జాతి, భారత దేశానికి గొప్ప స్ఫూర్తి ప్రదాతగా అల్లూరి నిలిచారని... ఆయన ఘనతను గుర్తుంచుకునే ఆయన పేరుపై జిల్లా ఏర్పాటు చేసినట్లు జగన్ వివరించారు. అల్లూరి సీతారామరాజు త్యాగం ప్రతి మనిషి గుండెల్లో చిరకాలం నిలిచిపోతుందని జగన్ పేర్కొన్నారు.
https://www.youtube.com/watch?v=iHq2hkrm_Mc
పెద అమీరం సభా వేదికపై అల్లూరి సీతారామరాజు వారసులను ప్రధాని మోదీ ప్రత్యేకంగా సత్కరించారు.
పెదఅమీరం సభాస్థలిపై ప్రధాని నరేంద్రమోదీని సీఎం జగన్ ఘనంగా సత్కరించారు. ప్రభుత్వం తరఫున జ్ఞాపిక అందజేశారు. అదేవిధంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రధాని మోదీకి విల్లును బహూకరించారు.
అల్లూరి సీతారామరాజు గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి.. అల్లూరి సీతారామరాజు సంచరించిన ప్రాంతాలన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి తీర్ధయాత్ర కేంద్రాలుగా తీర్చిదిద్దుతామని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలియజేశారు.
ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్టుకు తెలుగు జాతి ముద్దు బిడ్డ అల్లూరి సీతారామరాజు పేరు పెట్టాలని సీఎం జగన్‌కు సీపీఎం పార్టీ లేఖ రాసింది.
అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా భీమవరంలో ప్రధాని మోదీ ఆవిష్కరించనున్న కాంస్య విగ్రహానికి చాలా ప్రత్యేకతలున్నాయి. ఈ విగ్రహాన్ని రూ.3 కోట్ల వ్యయంతో 15 టన్నుల బరువుతో, 30 అడుగుల పొడవుతో నిర్మించారు. దీనిని ప్రసాద్ అనే శిల్పి 30 రోజుల్లో తయారు చేశారు. పాలకొల్లు మండలం ఆగర్రు గ్రామానికి చెందిన అల్లూరి సీతారామరాజు సహకారంతో దీన్ని తయారు చేయించారు.
అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు ప్రధాని మోదీ, గవర్నర్ హరిచందన్, సీఎం జగన్ భీమవరం చేరుకున్నారు.
గన్నవరం ఎయిర్‌పోర్టు వద్ద ప్రధాని మోదీ పర్యటనను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆందోళన నిర్వహించింది. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా ఏపీ కాంగ్రెస్ సమన్వయ కమిటీ సభ్యురాలు సుంకర పద్మశ్రీ బ్లాక్ బెలూన్‌లు పట్టుకుని మోదీ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. అయితే పోలీసులు సుంకర పద్మ శ్రీని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. అయితే చేతుల్లోని బ్లాక్ బెలూన్లు పగలకొట్టి విమానాశ్రయం ప్రధాన గేట్ వద్ద కూర్చుని పద్మశ్రీ నిరసనకు దిగే ప్రయత్నం చేశారు.
గన్నవరం నుంచి హెలికాప్టర్‌లో భీమవరం బయలుదేరిన ప్రధాని మోదీ.. హెలికాప్టర్‌లో ప్రధాని మోదీ వెంట గవర్నర్ హరిచందన్, సీఎం జగన్
పశ్చిమ గోదావరి జిల్లా పెదఅమీరం వద్ద ప్రధాని మోదీ సభా వేదిక జనంతో కిక్కిరిసిపోయింది. దీంతో అటు వైపుగా వస్తున్న ప్రజలను పోలీసులు అడ్డుకుంటున్నారు. వెనక్కి వెళ్లిపోవాలని ఆదేశిస్తున్నారు. అయినా పోలీసులను దాటుకుని ప్రజలు సభా స్థలం వైపు దూసుకొస్తుండటంతో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి.
తూర్పుగోదావరి జిల్లా: ప్రధాని మోదీ పర్యటనకు వ్యతిరేకంగా రాజమండ్రిలో కాంగ్రెస్ పార్టీ నిరసన చేపట్టింది. పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతలు ఆందోళన చేపట్టారు. మోదీ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు.
ప్రధాని మోదీ భీమవరం పర్యటన జాబితాలో ఎక్కడా తన పేరు లేకపోవడంతో నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు హైదరాబాద్‌లోనే ఉండిపోయారు. తాను భీమవరం రావడం లేదంటూ ఆయన ప్రధానికి లేఖ రాశారు. ప్రొటోకాల్ ప్రకారం ప్రధానిని స్థానిక ఎంపీ ఆహ్వానించాలని, కానీ ప్రధాని పర్యటన జాబితాలో తన పేరు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుందని ఆ లేఖలో ఫిర్యాదు చేశారు.
మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు మెగాస్టార్ చిరంజీవి భీమవరం చేరుకున్నారు. ఆయనకు గజమాలలతో మెగా అభిమానులు ఘనస్వాగతం పలికారు.
గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ప్రధాని మోదీ.. ఘనస్వాగతం పలికిన గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం జగన్

హైదరాబాద్ బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరిన ప్రధాని మోదీ కాసేపట్లో గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్నారు. గన్నవరం నుంచి హెలికాప్టర్ ద్వారా ఆయన భీమవరం చేరుకుంటారు. భీమవరానికి ప్రధాని మోదీతో పాటు గవర్నర్ హరిచందన్, సీఎం జగన్ కూడా వెళ్లనున్నారు.
https://www.youtube.com/watch?v=RFfTjgMlqRw
భీమవరం పర్యటనపై ప్రధాని మోదీ ట్వీట్ చేశారు..' ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా గొప్ప స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకలకు హాజరయ్యేందుకు భీమవరం బయలుదేరుతున్నాను. అక్కడ అల్లూరి కాంస్య విగ్రహాన్ని కూడా ఆవిష్కరించనున్నాను' అని ట్వీట్‌లో పేర్కొన్నారు.
Leaving for Bhimavaram to attend a very special programme- the 125th birth anniversary celebrations of the great freedom fighter Alluri Sitarama Raju. Will also unveil a bronze statue of Alluri Sitarama Raju. This will enhance the Azadi Ka Amrit Mahotsav celebrations.
— Narendra Modi (@narendramodi) July 4, 2022
ప్రధాని నరేంద్ర మోదీ సభలో పాల్గొనేందుకు మెగాస్టార్ చిరంజీవి కాసేపటి క్రితం హైదరాబాద్ నుంచి రాజమండ్రి ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. అనంతరం రోడ్డు మార్గం ద్వారా చిరంజీవి భీమవరం బయలుదేరారు.
ప్రధాని మోదీ భీమవరం పర్యటనలో అల్లూరి సీతారామరాజు వంశీయులు కలవనున్నారు. తమ కుటుంబానికి చెందిన 27 మంది ప్రధాని మోదీని కలిసేందుకు అధికారులు అనుమతి ఇచ్చారని అల్లూరి సోదరుడు సత్యనారాయణ రాజు మనవడు శ్రీరామరాజు వెల్లడించారు.
పెద అమీరంలో ప్రధాని మోదీ పాల్గొనే సభకు 60వేల మంది హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. బహిరంగ సభ వేదికకు ఎదురుగా ఓ వైపు మహిళలకు, మరోవైపు పురుషులకు ప్రత్యేకంగా 500 మంది చొప్పున పట్టేలా గ్యాలరీలు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో 3 వేల మంది పోలీసులతో ప్రధాని సభకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.