YS Jagan: ఇకనైనా రైతుల సమస్యలపై స్పందించకపోతే, పంటల కొనుగోలుకు శ్రీకారం చుట్టకపోతే.. ఆందోళన ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఇప్పటికైనా మార్క్‌ఫెడ్‌ను రంగంలోకి దింపి పోటీతత్వం పెంచి.. ప్రతి రైతుకు కనీసం యావరేజ్ ప్రైజ్ వచ్చేలా చర్యలు తీసుకోకపోతే కచ్చితంగా పోరాటం ఉధృతం అవుతుందని వార్నింగ్ ఇచ్చారు.. ప్రకాశం జిల్లా పొదిలిలో పొగాకు బోర్డు సందర్శించిన మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి, అక్కడ పొగాకు రైతుల సమస్యలు ఆరా తీశారు. కనీస గిట్టుబాటు ధర కూడా రాక, సరుకు కొనేవారూ లేక పొగాకు రైతులు పడుతున్న ఇబ్బందులు తెలుసుకున్న జగన్, ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు.
ఏపీలో మళ్లీ రైతు ఆత్మహత్యలు..
రాష్ట్రంలో ఈ రోజు రైతులు పడుతున్న అవస్థలు ఎలా ఉన్నాయంటే.. రైతులను ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి లేదన్ని ఆరోపించారు జగన్.. దీంతో రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఈ సీజన్ లోనే ఈ జిల్లాలో ఇద్దరు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. పరుచూరులో ఒక రైతు, గడిచిన శుక్రవారం కొండేపిలో మరో రైతు ఆత్మహత్య చేసుకున్నారని గుర్తుచేశారు.. రాష్ట్రంలో ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసినా, కనీస మద్దతు ధర కంటే రూ.300 తక్కువ రైతులకు చెల్లించారు. వరి, మిరప, పత్తి, జొన్న, కందులు, పెసలు, రాగులు, మొక్కజొన్న, కోకో, వేరుశనగ, చీనీ, పొగాకు ఇలా.. ఏ పంట తీసుకున్నా రైతన్నకు రాష్ట్రంలో గిట్టుబాటు ధర రాని పరిస్థితి కనిపిస్తోంది. అదే ఏడాది క్రితం వైయస్సార్‌సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు, రైతు రాజ్యంగా రాష్ట్రంలో పరిపాలన సాగించినప్పుడు, రైతు పరిస్థితి ఎలా ఉండేది? ఒక్క సంవత్సరంలో అది ఏ విధంగా దిగజారింది అని చెప్పడానికి నిదర్శనం జిల్లాలో జరిగిన రైతుల ఆత్మహత్యలే అని పేర్కొన్నారు.
రైతు భరోసా లేదు..
గత వైసీపీ ప్రభుత్వంలో రైతు భరోసా కింద ఇచ్చిన పెట్టుబడి సాయాన్ని చంద్రబాబు వచ్చిన తర్వాత ఆపేశారని విమర్శించారు జగన్.. ఈ పెద్దమనిషి చంద్రబాబు.. ప్రధాని మోడీ ఇచ్చే రూ.6 వేలు కాకుండా, మరో రూ.20 వేలు ఇస్తానని చెప్పి, గత ఏడాది మొత్తం ఎగరగొట్టాడు. ఈ ఏడాది మోడీ ఇవ్వాల్సిన రూ.6 వేలు ఇచ్చేసినా, చంద్రబాబు ఇవ్వాల్సింది మాత్రం ఎగరగొట్టే పరిస్థితుల మధ్య రాష్ట్రంలో వ్యవసాయం సాగుతోంది అధ్వానంగా అన్నారు.. వైసీపీ ప్రభుత్వ హయంలో ఏ సీజన్లో జరిగిన నష్టాన్ని ఆ సీజన్ ముగిసే నాటికి ఇచ్చే సాంప్రదాయం ఉండేది. ఈరోజు ఆ ప్రక్రియను గాలికి వదిలేసిన పరిస్థితుల మధ్య వ్యవసాయం జరుగుతోంది. మా హయాంలో రైతులకు పంట వేసిన తర్వాత, పంట నష్టపోతారన్న భయం లేకుండా, ప్రతి పంటకు రైతులకు ఉచితంగా పంటల బీమా చేసి, ప్రతి ఎకరాను ఈ–క్రాప్ చేసి, ఆర్బీకేల ద్వారా ఉచిత పంటల బీమా అమలు చేస్తే, చంద్రబాబు ప్రభుత్వం ఆ ఉచిత పంటల బీమా పథకాన్ని ఎత్తివేసిన పరిస్థితి కనిపిస్తోందన్నారు.
కూటమి ప్రభుత్వం అన్నింటినీ నీరుగార్చారు..
ఈ–క్రాప్ వ్యవస్థను పూర్తిగా నీరుగార్చారు. దళారులు లేకుండా పంటలు కొనుగోలు చేసే ఆర్బీకే వ్యవస్థను నీరుగార్చిన పరిస్థితి కనిపిస్తోందన్నారు జగన్.. ఎరువులు, విత్తనాలు, పురుగుల మందుల నాణ్యతను పరిశీలించి నాణ్యతకు ప్రభుత్వమే గ్యారంటీ ఇస్తూ, రాష్ట్రంలోని 146 రూరల్ నియోజకవర్గాల్లో ల్యాబ్‌లు ఏర్పాటు చేసి, వాటన్నింటినీ అందుబాటులోకి తెచ్చి, రైతులకు గ్రామంలోనే ఆర్బీకేల ద్వారా అందుబాటులో ఉండే పరిస్థితిని వైసీపీ ప్రభుత్వం కల్పించింది. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం వాటన్నింటినీ పూర్తిగా గాలికి వదిలేసి, మళ్లీ రాష్ట్రంలో కల్తీ విత్తనాలు, కల్తీ ఎరువులు, కల్తీ పురుగు మందులకు అవకాశం కల్పించింది. ఇంకా గత మా ప్రభుత్వ హయాంలో ధాన్యం కొనుగోలు చేయడమే కాకుండా, ఆర్బీకే వ్యవస్థ ద్వారానే దళారీ వ్యవస్థను తీసివేసి, రైతులకు కనీస మద్దతు ధర అందించే ప్రయత్నం చేయడంతో పాటు, ప్రతి రైతుకు జీఎల్‌టీ కింద.. గన్నీ బ్యాగులు, లేబర్, రవాణా ఛార్జీలుగా ప్రతి రైతుకు ఎకరాకు రూ.10 వేలు ఇచ్చాం. అదే ఈరోజు రైతుకు గిట్టుబాటు ధరలు రాని పరిస్థితి. ధాన్యాన్ని రూ.300 తక్కువకు కొనుగోలు చేసిన పరిస్థితి, రైతు దళారీలకు అమ్ముకున్న పరిస్థితి అన్నారు.
పొగాకు మద్దతు ధర చెల్లించరా..
పొగాకు పంటనే తీసుకుంటే.. మా ప్రభుత్వం చివరి సంవత్సరంలో కూడా.. 2023–24లో కేజీ రూ.360 అంటే క్వింటా రూ.36 వేలకు వర్జీనియా పొగాకు అమ్ముడుపోయింది. లోగ్రేడ్ కూడా రూ.24 వేలకు తగ్గకుండా అమ్ముడుపోయిన పరిస్థితి. ఈరోజు పరిస్థితి ఏమిటి అని మనమే వెళ్లి చూశాం. ఈరోజు జగన్ వస్తున్నాడని.. వీరంతా సిండికేట్ అయ్యి కాస్తో.. కూస్తో కొంత రేట్లు పెంచే ప్రయత్నం చేశారు. జగన్ వస్తున్నాడు.. జగన్ ఎక్కడ మాట్లాడతాడో.. అల్లరవుతామేమో అని. మార్చిలో ప్రొక్యూర్‌మెంట్ మొదలుపెట్టి జూన్ నాటికి పూర్తి చేయాలి. ఈ ఏడాది 220 మిలియన్ టన్నుల ప్రొక్యూర్‌మెంట్ చేయాల్సి వుంటే కేవలం 40 మిలియన్ టన్నులు మాత్రమే చేశారు. ఈరోజు రేటెంత అని చూస్తే హైగ్రేడ్ బ్రైట్ క్వాలిటీ రేటు సగటున కేవలం రూ.220 నుంచి రూ.260 మధ్యలో అమ్ముడుపోతున్న పరిస్థితి. హైగ్రేడ్ క్వాలిటీ రూ.240కి కూడా రాని పరిస్థితి నెలకొంది. నేను వచ్చాను కాబట్టి ఈరోజు రూ.280కు కొన్నారు. లోగ్రేడ్ చూస్తే కొనే నాథుడే లేడు. దాన్ని రూ.160 నుంచి రూ.180కి కొంటున్నారు. అది కూడా ధర నచ్చక రైతులు నలభై శాతం స్టాట్ వెనక్కి తీసుకెళ్తున్న పరిస్థితి. అదే మా ప్రభుత్వ హయాంలో ఇదే హైగ్రేడ్ క్వాలిటీ కేజీ రూ.366కు అమ్ముడు పోయింది. అంటే క్వింటా రూ.36 వేలకు కొన్నారు. జూన్ నెల సగానికి వచ్చి సీజన్ అయిపోతున్నా 220 మిలియన్ టన్నులు కొనాల్సి ఉంటే కొనుగోలు చేసింది కేవలం 40 మిలియన్ టన్నులు మాత్రమే. పక్కనే ఉన్న కర్నాటకలో కేజీ రూ.360 లకు కొనుగోలు చేస్తే మన రాష్ట్రంలో రైతులకు కనీసం యావరేజ్ రేటు రూ.200 కూడా దక్కడం లేదంటే రైతులు ఎంత దయనీయ పరిస్థితిలో వ్యవసాయం చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. బ్లాక్ బర్లీ పొగాకు చూస్తే గతేడాది మా వైయస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో రూ.15 వేల నుంచి రూ.18 వేల వరకు అమ్ముడుపోతే, ఈరోజు పరిస్థితి చూస్తే రూ.6 వేల నుంచి రూ.9 వేలు దాటడం లేదు. దీంతో పొగాకు రైతు ఎకరాకు రూ.80 వేలు నష్టపోతున్న పరిస్థితి అని ఆవేదన వ్యక్తం చేశారు..
నాడు పొగాకు రైతుకు స్వర్ణయుగం:
మా ప్రభుత్వం ఏర్పాటయ్యాక రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా మొట్టమొదటిసారిగా 2020లో ఆక్షన్‌లోకి మార్క్‌ఫెడ్‌ను రంగంలోకి దింపింది. అలా మార్కెట్‌లో పోటీ పెంచి, ఏకంగా రూ.140 కోట్లు ఖర్చు చేసి కార్టల్‌ను బ్రేక్ చేసి రైతులకు గిట్టుబాటు ధరలు దక్కేలా చూశాం. అదే ఈరోజు రైతు సంక్షేమం గురించి ఆలోచించే పరిస్థితి లేదు. గిట్టుబాటు ధరలు ఇప్పించాలన్న తపన తాపత్రయం ఎక్కడా లేదు కాబట్టే రైతులు తీవ్రంగా నష్టపోతున్న పరిస్థితులు రాష్ట్రంలో కనిపిస్తున్నాయన్నారు వైఎస్ జగన్.. ఇక, మిర్చిరైతుకు రూ.4 లక్షల పరిహారం ఇచ్చిన ఘనత మాదే. ఇదే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కనిగిరి, గిద్దలూరు, మార్కాపురంలో రైతు ఏనాడూ భయపడేవాడు కాదు. ఏ పంట వేసినా వరదలొచ్చినా, తుపాన్ వచ్చినా, కరువొచ్చినా.. ఇన్సూరెన్స్ కట్టామా లేదా అనే దిగులు రైతుకు ఉండేది కాదు. వారి తరఫున రాష్ట్ర ప్రభుత్వమే ఉచిత పంటల బీమా డబ్బులు కట్టేది. అయితే, చంద్రబాబు సీఎం అయ్యాక రైతులకు మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. వ్యవసాయం దండగ అనే పరిస్థితికి రాష్ట్రాన్ని తీసుకెళ్లాడు. ఈ సంవత్సరం 20 శాతం పొగాకు ఎక్కువ పండించండి మేము కొనుగోలు చేస్తామని పొగాకు బోర్డు హామీ ఇచ్చింది. పంటను కొంటామని హామీ ఇవ్వడం వల్ల వ్యవసాయ విస్తీర్ణం 30 శాతం పెరిగింది. కానీ చంద్రబాబు పుణ్యాన ఆర్బీకేలు నిర్వీర్యం అయిన నేపథ్యంలో రైతులు ప్రతిదీ బ్లాకులో కొనుగోలు చేయాల్సి వస్తోందన్నారు.