Site icon NTV Telugu

పవన్‌ కల్యాణ్‌ వైజాగ్‌ సభ.. పోలీసుల అనుమతి నిరాకరణ..!

జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశాఖపట్నం టూర్‌కు సిద్ధం అయ్యారు.. రేపు విశాఖలో పర్యటించనున్న ఆయన.. విశాఖ ఉక్కు పరిశ్రమ కార్మికులకు అండగా పోరాటంలో పాల్గొననున్నారు.. ఓవైపు ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణపై కేంద్రం ముందుకు సాగుతున్నా.. మరోవైపు పోరాటం కొనసాగిస్తున్నారు కార్మికులు.. వారికి ఇప్పటికే బీజేపీ మినహా అన్ని పార్టీలు మద్దతు ప్రకటించగా.. ఇప్పుడు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ ప్రత్యక్షంగా మద్దతు తెలపనున్నారు.. అయితే, వైజాగ్‌లో పవన్ కళ్యాణ్ బహిరంగ సభ వేదికపై సందిగ్ధత నెలకొంది.

స్టీల్ ప్లాంట్ మెయిన్ రోడ్డు పై సభ ఏర్పాటుకు సిద్ధం అయ్యాయి జనసేన శ్రేణులు.. ఇప్పటికే ఆ ప్రాంతానికి లారీల్లో స్టేజ్ మెటీరియల్ తరలించారు.. అయితే, ఆ ప్రాంతంలో సభకు మాత్రం ఇంకా పోలీసులు అనుమతి ఇవ్వలేదు.. స్టేజ్ ఫేసింగ్ పై పోలీసులు, సభ నిర్వాహకుల మధ్య సమన్వయం లేకపోవడంతో ఈ సమస్య వచ్చినట్టుగా తెలుస్తోంది.. పవన్‌ కల్యాణ్ సభకు వేలాదిగా జనం తరలివస్తే జాతీయ రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోతుందని పోలీసులు అభ్యంతరం చెబుతున్నారు.. కానీ, సభకు వచ్చేవారిని అడ్డుకోవడానికే పోలీసులు అభ్యంతరాలు చెబుతున్నారంటూ జనసేన పార్టీ ఆరోపిస్తుంది. ఈ పరిస్థితుల్లో స్టేజ్‌ ఎక్కడ ఏర్పాటు చేస్తారు..? పోలీసుల అనుమతి మాట ఏంటి? అనేదానిపై క్లారిటీ రావాల్సిఉంది.

Exit mobile version