national labour conference: కోట్లాది మంది సంఘటిత, అసంఘటిత రంగాల కార్మికుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. భారతదేశ కలలను, ఆశలను నెరవేర్చడం ద్వారా జాతి నిర్మాణంలో శ్రామిక శక్తి ప్రధాన పాత్ర పోషిస్తోందని మోడీ కొనియాడారు. తిరుపతిలో రెండు రోజుల కార్మిక సదస్సును ప్రధాని ఢిల్లీ నుంచి వర్చువల్ వేదికగా ప్రారంభించారు. కేంద్ర కార్మిక శాఖ మంత్రి ఎస్‌హెచ్ భూపేంద్ర యాదవ్ అధ్యక్షత వహించిన ఈ సదస్సుకు వివిధ రాష్ట్రాల కార్మికశాఖ మంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఇవాళ ఆ జాతీయ సదస్సు ముగిసింది. కేంద్రం అమలు చేస్తున్న ప్రధానమంత్రి శ్రమ యోగి మాన్‌ధన్ యోజన, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన తదితర పథకాలు కోట్లాదిమంది కార్మికులకు ఎంతో కొంత రక్షణ, భద్రత కల్పిస్తున్నాయని ప్రధాని పేర్కొన్నారు. దేశానికి కార్మికులు చేస్తున్న కృషి అందిస్తున్న తోడ్పాటుకు గుర్తింపు ఈ పథకాలని అన్నారు. కరోనా సమయంలో దేశాన్ని గట్టెక్కించేందుకు కార్మికులు ఎంతగానో కృషి చేశారన్నారు. కార్మిక శక్తికి భద్రత కల్పించడంలో ఇ-శ్రమ్ పోర్టల్ కీలక పాత్ర పోషిస్తోందని, ఏడాదిలోనే 28 కోట్లమంది కార్మికులు పోర్టల్‌లో నమోదయ్యారని తెలిపారు. భవన నిర్మాణ కార్మికుల సెస్ నిధులను రూ.38 వేల కోట్లకుపైగా రాష్ట్ర ప్రభుత్వాలు వినియోగించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
జాతీయ సదస్సు ముగింపు కార్యక్రమంలో కేంద్ర కార్మిక శాఖ మంత్రి ఎస్‌హెచ్ భూపేంద్ర యాదవ్ ప్రసంగించారు. కార్మిక శాఖ 2047 విజన్ డాక్యుమెంట్ రూపొందిస్తోందని ఆయన తెలిపారు. విజన్ డాక్యుమెంట్‌పై రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాల కార్మిక శాఖ మంత్రులతో చర్చించామని.. 2047 విజన్ డాక్యుమెంట్‌పై ఏకాభిప్రాయం సాధించేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు. జాతీయ సదస్సులో కార్మికులు మహిళలు రైతుల అభివృద్ధిపై విస్తృతంగా చర్చ జరిపామన్నారు. అసంఘటిత రంగంలో ఉన్న కార్మికుల కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ప్రధానమంత్రి సురక్ష యోజన పథకం ద్వారా లబ్ధి చేకూరుస్తున్నామని ఆయన వెల్లడించారు.
AP CM YS Jaganmohan Reddy: సీబీఐ కోర్టులో సీఎం జగన్ వ్యక్తిగత హాజరుకు హైకోర్టు మినహాయింపు
కార్మికులకు సామాజిక భద్రత కల్పించేలా చర్యలు చేపడుతున్నామన్నారు. ఈఎస్ఐ, ఆయుష్మాన్ భారత్‌ల ద్వారా కార్మిక కుటుంబాలకు ఉచిత వైద్య సౌకర్యం కల్పిస్తున్నామని కేంద్ర మంత్రి తెలిపారు. ఈఎస్ఐ ఆసుపత్రులలో వసతులు పెంపొందించి అర్హత ఉన్న వైద్యుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. కార్మికులకు సామాజిక భద్రత, స్వావంలంభన కోసం కృషి చేస్తున్నామని వెల్లడించారు. రెండు రోజుల సదస్సు విజయవంతం కావడానికి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం, అధికారులు ఎంతో కృషి చేశారని ఆయన కొనియాడారు. సదస్సుకు సహకరించిన ప్రభుత్వ యంత్రాంగానికి ధన్యవాదాలు తెలిపారు. వర్కింగ్ జర్నలిస్ట్స్ యాక్ట్, వేజస్ యాక్ట్ రద్దు తమ పరిధి లోకి రాదన్నారు. జర్నలిస్ట్స్ యాక్ట్ రద్దుపై ఢిల్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.