తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో నిర్వహించిన ప్లీనరీ సమావేశాల్లో ఉభయగోదావరి వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్ , ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీపై ధ్వజమెత్తారు. ప్రజలు అమోదించిన పథకాలు అమలు చేయడం నేరమా అని ఆయన ప్రశ్నించారు. 210 హామీలలో 195 హామీలు చంద్రబాబు ఎగ్గొట్టారని సుభాష్ చంద్రబోస్ ఆరోపించారు. సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే నేరగాళ్ళంటారా అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ధనికుడు నుంచి సామాన్యుడు వరకూ సంక్షేమ ఫలాలు ఏదోరూపంలో అందుతున్న పరిస్థితి ఉందని ఆయన అన్నారు. కోవిడ్ వల్ల ప్రభుత్వ ఆదాయం కోల్పోయినా పేదలకు ఇచ్చిన హమీలు అమలు చేశారన్నారు.
కోవిడ్ ను అరికట్టడంలో ఏపీ ముందంజలో వుందని పీఎం పార్లమెంటు లోనే చెప్పారని, ప్రతిపక్షాలు నోటికొచ్చినట్టు ప్రభుత్వంపై విమర్శలు చేయడం తగదని సుభాష్ చంద్రబోస్ హితవు పలికారు. ప్రభుత్వం మారినప్పుడు తక్షణం తీరాల్సిన అప్పు 4500 కోట్లు వరకూ వుండే స్థితినుంచి 80వేల కోట్లతో చంద్రబాబు అప్పగించారని, ఆ అప్పులు తీర్చడం తప్పా, రైతులను ఆదుకోవడం తప్పా, కోవిడ్ సమయంలో పేదలను ఆదుకోవడం తప్పా అని ఆయన ప్రశ్నించారు. మరో ఐదేళ్ళూ సంక్షేమం కొనసాగాలంటే తిరిగి సీఎంగా జగన్ ను ఎన్నుకోవాల్సిన ఆవశ్యకత వుందని ఆయన పేర్కొన్నారు. అన్న మాటను నిలబెట్టుకున్న నాయకుడు సీఎం జగన్ అని ఆయన కొనియాడారు.