హైదరాబాద్ ముచ్చింతల్ లో సమతా స్ఫూర్తి విగ్రహం కనుల పండువగా ఆవిష్కారం అయింది. సమతామూర్తి విగ్రహావిష్కరణకు వచ్చిన ప్రధాని మోదీ ఆహార్యం చూపరుల్ని విశేషంగా ఆకర్షించింది. యాగంలో పాల్గొనేందుకు వీలుగా వస్త్రధారణతో.. విష్ణునామాలు పెట్టుకుని విచ్చేశారు. బంగారు వర్ణపు పంచె ధరించి విష్వక్సేనేష్టి యాగానికి హాజరయ్యారు. ఉజ్జీవన సోపాన వేదిక నుంచి లేజర్ షో వీక్షించే వేదిక వరకు నడుచుకుంటూ వచ్చారు. సభ ముగిశాక ఉజ్జీవన సోపానంపై నుంచి 108 మెట్లు దిగి కిందికి వచ్చారు.
భారతదేశ ఐక్యత, సమగ్రతకు జగద్గురువు రామానుజాచార్య ప్రేరణ అని, ఆయన బోధనలు ప్రపంచానికి దారి చూపిస్తాయని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. సద్గుణాలతోనే లోక కల్యాణం జరుగుతుందని, జాతులతో కాదని పేర్కొన్నారు. దేశంలో ఎలాంటి వివక్ష లేకుండా అందరూ అభివృద్ధి చెందాలని, భేదాభిప్రాయాలు లేకుండా ప్రతి ఒక్కరూ సామాజిక న్యాయం పొందాలన్నారు. శ్రీరామానుజ విగ్రహం ఆయన్ని బాగా ప్రేరేపించింది.