Pemmasani Chandrasekhar : కేంద్ర ఐటీ, టెలికమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రజలకు ముఖ్య విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరూ సైబర్ మోసాల నుంచి రక్షణ పొందేందుకు ‘సంచార్ సాథీ’ యాప్‌ను తప్పనిసరిగా వినియోగించాలని ఆయన సూచించారు. టెలికాం మంత్రిత్వ శాఖ, డిజిటల్ ఇంటెలిజెన్స్ అధికారులతో కలిసి ఈ యాప్‌ను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేశామని తెలిపారు. మంత్రి వెల్లడించిన వివరాల ప్రకారం.. గత ఏడాది నుంచి దేశవ్యాప్తంగా 50 లక్షల మంది సైబర్ ఫ్రాడ్‌లకు గురయ్యారు. ఇప్పటి వరకు రూ.23 వేల కోట్లు ప్రజలు నష్టపోయారని ఆయన తెలిపారు. ముఖ్యంగా వృద్ధులు, డిజిటల్ అవగాహన తక్కువగా ఉన్నవారే ఎక్కువగా మోసపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
సైబర్ నేరాలను అరికట్టడానికి, ఫోన్ దొంగతనం, నకిలీ సిమ్‌లు, ఫ్రాడ్ కాల్స్ వంటి సమస్యలను గుర్తించడానికి సంచార్ సాథీ యాప్‌ను రూపొందించామని మంత్రి వివరించారు. ఫోన్ దొంగిలించబడిందా, దొంగిలించిన ఫోన్ ఎక్కడ అమ్ముడవుతోందా వంటి కీలక సమాచారాన్ని కూడా ఈ యాప్‌తో తెలుసుకోవచ్చని చెప్పారు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 2 కోట్లు 20 లక్షల మొబైల్ నంబర్లు బ్లాక్ చేసినట్లు ఆయన తెలిపారు. అలాగే 26 లక్షల మొబైల్ ఫోన్లు దొంగిలించబడ్డ కేసుల్లో, 7 లక్షల ఫోన్లను రికవరీ చేసినట్లు కూడా వెల్లడించారు. మొబైల్ తయారీ కంపెనీలకు ఈ యాప్‌ను ఫోన్లలో డిఫాల్ట్‌గా ఇన్‌స్టాల్ చేసి ఇవ్వాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు.
ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని, సంచార్ సాథీ యాప్‌లో ఏ విధమైన భద్రతా సమస్యలూ లేవని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు ఈ యాప్ సహాయంతో రూ.500 కోట్లకు పైగా ఫ్రాడ్ ట్రాన్సాక్షన్లను అడ్డుకున్నామని మంత్రి పెమ్మసాని వెల్లడించారు. సైబర్ సేఫ్టీ కోసం ఈ యాప్‌ను ప్రజలు తప్పనిసరిగా వినియోగించాలంటూ ఆయన పిలుపునిచ్చారు.
December 2 Significance: డిసెంబర్ 2 ప్రాముఖ్యత, ప్రత్యేకతలు ఇవే..