ఏపీలోని పలు జిల్లాల ప్రజలు అసని తుఫాన్ కారణంగా అష్టకష్టాలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. అసని తుఫాన్ ప్రభావం ముఖ్యంగా కోస్తా జిల్లాలు, గోదావరి జిల్లాల మీద తీవ్ర స్థాయిలో కనిపిస్తోందన్నారు. దీంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. అసని తుఫాన్ బాధితులను ప్రభుత్వం అన్నివిధాలుగా ఆదుకోవాలని కోరారు. రైతాంగానికి ప్రభుత్వం భరోసా ఇవ్వాలన్నారు. వరి పంట కోత కోసే సమయంలో ఈ విపత్తు రావడం దురదృష్టకరమని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు.
Read Also:
అనేక గ్రామాల్లో ధాన్యం కళ్లాల్లోనే ఉండటంతో రైతులు ఆందోళన పడుతున్న విషయం తన దృష్టికి వచ్చిందని పవన్ కళ్యాణ్ తెలిపారు. ప్రభుత్వం తక్షణం స్పందించి రైతులకు భరోసా ఇవ్వాలని పవన్ డిమాండ్ చేశారు. ధాన్యం సేకరణలో నిబంధనలు సడలించాలని కోరారు. ముఖ్యంగా 17 శాతం మించి తేమ ఉండకూడదు అనే నిబంధన ఈ సమయంలో వర్తింపచేస్తే రైతులు తీవ్రంగా నష్టపోతారని పవన్ పేర్కొన్నారు. కాబట్టి తడిచిన, రంగు మారిన ధాన్యాన్ని ప్రభుత్వం కచ్చితంగా కొనుగోలు చేయాలని సూచించారు.
అటు అసని ప్రభావం వల్ల పండ్ల తోటలకు, ఉద్యాన పంటలు వేసిన రైతులు కూడా దెబ్బ తిన్నారని.. పంటనష్ట పరిహారాన్ని తక్షణమే లెక్కించి వాస్తవ నష్టానికి అనుగుణంగా పరిహారం ఇవ్వాలని హితవు పలికారు. అటు తీరంలోని మత్స్యకార గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. ఇల్లు దెబ్బ తిన్న బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. జనసైనికులు, పార్టీ నాయకులు బాధితులకు బాసటగా నిలవాలని సూచించారు.
అసని తుపాను బాధితులను అన్ని విధాలా ఆదుకోవాలి – JanaSena Chief Shri @PawanKalyan pic.twitter.com/ofpFpwYfS1
— JanaSena Party (@JanaSenaParty) May 11, 2022