టీటీడీలో జరుగుతోన్న పరిణామాలపై తీవ్రంగా స్పందించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. టీటీడీలోని 4 వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులుకు జనసేనా అండగా ఉంటుందని స్పష్టం చేశారు.. పాదయాత్రలో వైఎస్ జగన్ ఇచ్చిన హామీని ఎందుకు విస్మరించారు అంటూ ఫైర్ అయ్యారు.. టీటీడీ కాంట్రాక్ట్ ఉద్యోగుల సహేతుకమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు జనసేనాని.. 2010లో టీటీడీ సూచనల మేరకే 4 వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు సొసైటీలు ఏర్పాటు చేసుకున్నారు.. మరి కొత్తగా ఇప్పుడు కార్పొరేషన్ ఎందుకు? అని నిలదీశారు.. ఉన్న వ్యవస్థలను మార్చే సమయంలో అత్యంత జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉందని సూచించిన ఆయన.. ఈ విషయంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంతో వ్యవహరించి ఘోర వైఫల్యం చెందిందని విమర్శించారు.
ఉద్యోగుల జీవితాల్లో అల్ల కల్లోలం సృష్టించింది వైసీపీ ప్రభుత్వం అంటూ ఫైర్ అయ్యారు పవన్ కల్యాణ్.. 73 సంఘాలను రద్దు చేసి కార్పొరేషన్‌గా మార్చడం… ఉద్యోగులను రోడ్డు మీదకు ఈడ్చే దారుణమైన చర్యగా ఆరోపించిన ఆయన.. దీనిని పొమ్మనకుండా పొగపెట్టడం లాంటి నిర్ణయంగా భావించాల్సి ఉంటుందన్నారు.. కార్పొరేషన్‌లో చేరని ఉద్యోగులను.. ఉద్యోగాన్ని కోల్పోవాల్సి వస్తుందని బెదిరిస్తున్నారని.. వారిని కార్పొరేషన్‌లో చేరాలని బలవంతపెట్టడం శ్రామిక చట్టాలను ఉల్లంఘించడం కాదా? అని మండిపడ్డారు.. కొత్తగా కార్పొరేషన్ ఏర్పాటు చేయడం… నిధులు దారి మళ్లించేందుకేనా? అంటూ తీవ్ర ఆరోపణలు చేసిన పవన్.. బోర్డును నియమించే హక్కు ఎవరికుంది? ఈ ప్రక్రియలో పారదర్శకత ఉందా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.. తిరుమల ఆలయంలో నిత్య కైంకర్యాలలో భాగస్వామ్యులైన 73 సొసైటీలలో ఉన్న నాలుగు వేల మంది ఉద్యోగులను ఒప్పించ లేకపోయిందా? అంటూ ప్రశ్నించిన పవన్.. నాలుగు వేల మంది ఉద్యోగులకు మద్దతు కల్పించాలన్న ఉద్దేశ్యం లేని వైసీపీ, వారికి పాదయాత్రలో ఎందుకు హామీలు ఇచ్చింది.. కాంట్రాక్ట్ ఉద్యోగులకు జనసేన పార్టీ అండగా ఉంటుంది అని స్పష్టం చేశారు.