వైసీపీ పాలకులు ప్రజలకు ఎలాగూ రక్షణ ఇవ్వరు.. కనీసం పోలీసులైనా స్వతంత్రంగా వ్యవహరించాలి. శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు రాజకీయ బాసుల మాటకు తలొగ్గవద్దు. నేరాలకు పాల్పడేవారికి వత్తాసు పలికేలా అధికార యంత్రాంగాన్ని పాలకులు వినియోగించుకొంటుంటే ఇక శాంతిభద్రతల గురించి ఆలోచన కూడా చేయలేం. కాకినాడలో ఎస్సీ యువకుడు సుబ్రహ్మణ్యం హత్య కేసులో పోలీసుల వ్యవహార శైలి సరిగా లేదన్నారు జనసేనాని పవన్ కళ్యాణ్.
హత్య తానే చేశానని ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్ ఒప్పుకొన్న తరవాత కూడా అధికారులు అతని పట్ల అత్యంత గౌరవమర్యాదలు కనబరిచిన తీరు చూస్తే విస్మయం కలుగుతోంది. సామాన్యుల పట్ల కూడా ఇంతే సహృదయత కనబరుస్తారా?ఈ విధమైన తీరుకి పోలీసుల కంటే వారిపై ఆధిపత్యం చలాయిస్తున్న రాజకీయ బాసులే కారణం.
కోడి కత్తి కేసులో ఆంధ్రప్రదేశ్ పోలీసులపై నమ్మకం లేదన్న వారే ఇప్పుడు ఆ శాఖకు దిశానిర్దేశం చేస్తున్నారు. కోడి కత్తి కేసు పురోగతి ఏమిటో తెలియదు. పులివెందులలో వైఎస్ వివేకా హత్య కేసు వ్యవహారం గుండె పోటు నుంచి గొడ్డలి పోటు వరకు వెళ్లింది. ఇప్పటికీ సాగుతున్న విచారణలో అసలు దోషులెవరో తేలలేదు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణను వైసీపీ పాలకుల నుంచి ఏమీ ఆశించలేం. వారికే చిత్తశుద్ధి ఉంటే- హత్య చేశాను అని ఒప్పుకొన్న ఎమ్మెల్సీపై ఈపాటికే పార్టీపరంగాను, పెద్దల సభ నుంచి పంపేలా చర్యలకు ఉపక్రమించేవారన్నారు పవన్.