CM Chandrababu: రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేశాం.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం

Babu

Babu

CM Chandrababu: మూడు ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొన్నానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. యోగా కార్యక్రమంలో బాబా రాందేవ్‌తో కలిసి పాల్గొనగా, స్వచ్ఛాంధ్ర మరియు అన్నదాత సుఖీభవ కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నట్లు చెప్పారు. ప్రజలు ఆర్థికంగా, ఆరోగ్యపరంగా బాగుంటేనే నిజమైన ఆనందం ఉంటుందని పేర్కొన్నారు. అన్నదాత సుఖీభవ పథకం కింద రైతుల ఖాతాల్లో నిధులు జమ చేసినట్లు తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటున్నామని, రైతుల సమస్యలన్నీ పూర్తిగా పరిష్కరించామని చెప్పడం లేదని, అయితే వారికి అండగా నిలుస్తున్నామని స్పష్టం చేశారు. వైసీపీ పాలనలో రైతులు అనేక కష్టాలు ఎదుర్కొన్నారని విమర్శించారు.

ప్రకృతి వ్యవసాయమే భవిష్యత్

రసాయన ఎరువుల వినియోగం పెరగడం వల్ల భూమి సారవంతత దెబ్బతింటోందని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. భూమి కన్నతల్లితో సమానమని, దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత రైతులపై ఉందన్నారు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నామని, కల్తీ లేని గానుగ నూనె వినియోగం పెంచాలని సూచించారు. చైనా తిరస్కరించిన మిర్చి ఎగుమతుల అంశాన్ని ప్రస్తావించిన సీఎం, గుంటూరు మిర్చికి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉందన్నారు. తోతాపురి మామిడికి కిలోకు రూ.4 మద్దతు ధర అందించామని, బర్లీ పొగాకు కొనుగోలు చేశామని చెప్పారు. సాధారణ పొగాకు ధరలు పడిపోకుండా చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు.

×
×
Ad

పామాయిల్, హార్టికల్చర్‌కు ప్రోత్సాహం

పల్నాడు జిల్లాలో 20 మండలాల్లో పామాయిల్ సాగును ప్రోత్సహిస్తున్నామని చెప్పారు సీఎం చంద్రబాబు.. రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఇరాన్ యుద్ధ ప్రభావంతో మామిడి, ఆక్వా రంగాలు దెబ్బతిన్నాయని, ఆక్వా రైతులకు ఉపశమనం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇక, 2027 మార్చి-ఏప్రిల్ నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. నదుల అనుసంధానం ఎన్టీఆర్ సంకల్పమని, అది తన జీవితాశయమని పేర్కొన్నారు. పెన్నా సహా రాష్ట్రంలోని అన్ని ప్రధాన నదులను అనుసంధానం చేసే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు.

అభివృద్ధికి అడ్డంకులు సృష్టించే వారిపై విమర్శలు

కొన్ని రాజకీయ పార్టీలు విషం చిమ్మడం, అభివృద్ధిని అడ్డుకోవడం తప్ప మరే పని చేయడం లేదని సీఎం విమర్శించారు. రాష్ట్రాన్ని ప్రపంచ టెక్నాలజీ కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని, రైతు సంక్షేమం, అభివృద్ధి రెండింటినీ సమన్వయం చేస్తూ ముందుకు వెళ్తామని చెప్పారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..