ACB Raid: పెండింగ్‌లో ఉన్న క్యాటరింగ్ బిల్లు క్లియర్ చేసేందుకు లంచం డిమాండ్ చేసిన ఓ అధికారి.. లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబట్టారు.. మూడు లక్షలు లంచం తీసుకుంటూ పల్నాడు జిల్లా రెవెన్యూ అధికారి మురళి ఏసీబీ అధికారులకు పట్టుబడడం సంచలనం సృష్టించింది. నర్సరావుపేటకు చెందిన కరిముల్లా క్యాటరింగ్ కాంట్రాక్టు చేస్తుంటారు. గత ప్రభుత్వంలో వరికపూడిసెల ప్రాజెక్టు శంకుస్థాపన మాచర్లలో జరిగింది. ఈ కార్యక్రమానికి క్యాటరింగ్ ఆర్డర్ కరిముల్లా దక్కించుకున్నారు. అయితే, క్యాటరింగ్ బిల్లు 26 లక్షల రూపాయాలు పెండింగ్‌లో ఉంది. దీంతో బిల్లు మంజూరుకోసం అధికారుల చుట్టూ తిరుగుతున్నాడు. ఈ నేపథ్యంలో పెండింగ్ లో ఉన్న బిల్లు మంజూరు చెయ్యాలని డీఆర్వో మురళిని కోరారు. బిల్లు మంజూరు కోసం మూడు లక్షలు లంచం డిమాండ్ చేశారు.
అయితే, సదరు అధికారికి లంచం ఇవ్వడం ఇష్టం లేని కరిముల్లా.. ఏసీబీ అధికారులను ఆశ్రయించారు.. లంచం వ్యవహారంపై ఫిర్యాదు చేశాడు. దీంతో పక్కా పథకం ప్రకారం డీఆర్వో మురళి మూడు లక్షల రూపాయాలు లంచంగా తీసుకుంటున్న సమయంలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. లంచం నగదును స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు.. డీఆర్వో మురళిని అదుపులోకి తీసుకున్నారు. డీఆర్వో మురళిని ఏసీబీ కోర్టులో హాజరుపర్చేందుకు విజయవాడకు తీసుకెళ్లారు. మధ్యాహ్నం విజయవాడ ఏసీబీ కోర్టులో డీఆర్వో మురళిని హాజరుపర్చనున్నారు.