సాధారణంగా ఉల్లిగడ్డలు తరిగేటప్పుడు కన్నీరు వస్తుంది. కానీ తరగకుండానే రైతులకు ఉల్లిగడ్డలు కన్నీరు పెట్టిస్తున్నాయి. బహిరంగ మార్కెట్‌లో ఒక్కసారిగా ఉల్లిపాయల ధరలు పడిపోవడంతో అన్నదాతలు లబోదిబోమంటున్నారు. తాము పండించిన పంటకు గిట్టుబాటు ధర రాకపోవడంతో ఉల్లి రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కర్నూలు జిల్లాలో ఉల్లి రైతులు ఆందోళనకు దిగారు.
Read Also: ఇద్దరు టీడీపీ నేతలను సస్పెండ్ చేసిన చంద్రబాబు
శనివారం రోజు కర్నూలు జిల్లా పంచలింగాలకు చెందిన వెంకటేశ్వర్లు అనే రైతు తాను పండించిన ఉల్లి పంటను విక్రయించేందుకు కర్నూలు వ్యవసాయ మార్కెట్‌కు తీసుకువచ్చాడు. ఈ-నామ్ పద్ధతిలో క్వింటాల్ ఉల్లికి రూ.350 మాత్రమే రావడంతో అన్నదాతల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. తమకు ఆ ధర ఏ మాత్రం గిట్టుబాటు కాదని.. ఎండ అనక.. వాన అనక.. ఎంతో కష్టపడి పండించిన పంటకు కేవలం రూ.350 మాత్రమే రావడాన్ని జీర్ణించుకోలేని రైతు వెంకటేశ్వర్లు తాను తెచ్చిన ఉల్లిబస్తాలపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అయితే ఈ ఘటనపై మార్కెటింగ్‌శాఖ అధికారులు స్పందించి… క్వింటాల్‌కు రూ.700 ఇప్పిస్తామని ప్రకటించడంతో రైతులు శాంతించారు.