ఊరు మారినా… తీరు మారలేదన్నట్టుగా ఆ మాజీ ఎమ్మెల్యే పరిస్థితి ఉందా? ఉన్న పార్టీని కాదని అధికార కూటమివైపు జంప్ చేసినా… ఆశించిన ప్రయోజనం మాత్రం దక్కలేదా? అసలెందుకు అలాంటి నిర్ణయం తీసుకున్నాను రా… బాబూ… తప్పుచేశానా అని ఇప్పుడు తెగ ఫీలైపోతున్నారా? ఎవరా మాజీ సీనియర్ ఎమ్మెల్యే? ఆయన నైరాశ్యానికి కారణాలేంటి? ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశారు సామినేని ఉదయభాను. రెండు విడతలు కాంగ్రెస్, మూడు సార్లు వైసీపీ తరపున బరిలో దిగారాయన. మొత్తం మీద మూడు విడతలు విజయం సాధించగా… వైసీపీ ప్రభుత్వంలో విప్‌గా కూడా పనిచేశారాయన. అటు రాజశేఖర్‌రెడ్డి హయాంలో, ఇటు జగన్ హయాంలో జిల్లా రాజకీయాల్లో కీలకపాత్ర పోషించారు ఉదయభాను. 2019లో ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు మంత్రి పదవి ఆశించారాయన. రేస్‌లో ఉన్నట్టు చివరి వరకు ప్రచారం జరిగినా…. కుల సమీకరణల్లో భాగంగా ఆయనకు కేబినెట్ బెర్త్ దక్కలేదు. వైఎస్ కుటుంబానికి సన్నిహితంగా ఉన్నాసరే… మంత్రి పదవి రాలేదంటూ… అప్పట్లో అలకబూనారు సామినేని.
తనకు మంత్రి పదవి రాకుండా కుట్ర జరిగిందని కూడా అప్పట్లో అన్నారాయన. ఆ అసంతృప్తి అలా కొనసాగుతూనే… 2024 ఎన్నికల నాటికి వైసీపీ వీడి జనసేనలో చేరతారని, ఆ పార్టీ తరపున విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. కానీ…చివరికి వైసీపీ తరపునే జగ్గయ్యపేట నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇక ఎన్నికల తర్వాత వైసీపీ వీడి జనసేనలో చేరారు ఉదయభాను. ఎన్టీఆర్ జిల్లా అధ్యక్ష పదవిని మాజీ ఎమ్మెల్యేకి ఇచ్చారు పవన్. నియోజకవర్గం నుంచి జిల్లా స్థాయికి వెళ్ళి… ఒక రకంగా ప్రమోట్ అయినా, తాము కూటమిలో భాగస్వామి అయినా… అనుచరులకు కనీస పదవులు కూడా ఇప్పించుకోలేకపోతున్నానన్న అసంతృప్తి పెరుగుతోందట ఉదయభానులో.
పేరుకే అధికార కూటమిలో, ఒక పార్టీకి జిల్లా అధ్యక్షుడిగా ఉన్నానుగానీ….ఫలానా పని కావాలంటూ దగ్గరికి వచ్చిన వాళ్ళకు గ్యారంటీ ఇవ్వలేకపోతున్నానని, అసలే పనులు కావడంలేదని ఆయన సన్నిహితులతో వాపోతున్నట్టు సమాచారం. గతంలో వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కొందరికి కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఇప్పించగా… కూటమి అధికారంలోకి వచ్చాక వాళ్ళని తొలగించారట. కూటమి భాగస్వామ్య పార్టీ జిల్లా అధ్యక్షుడిగా… తాను ఆపే ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయిందని చెప్పుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా జనసేనలో చేరికలు జరుగుతున్నా… వారికి కనీసం పార్టీ పదవులు కూడా ఇప్పించలేని పరిస్థితి ఉండటంతో అసలు తమను గుర్తిస్తున్నారా లేక పేరుకు మాత్రమే ఉన్నామా అని సామినేని వర్గం ఫీలవుతున్నట్టు తెలుస్తోంది. జనసేనలో అంతకు ముందు నుంచి ఉన్న కొందరు నేతలు గ్రూపుగా ఏర్పడి రాజకీయాలు చేయటం సామినేని వర్గాన్ని ఇరుకున పెడుతోందట. ఇక 25 ఏళ్ళుగా ఆయన రాజకీయాలు చేసిన జగ్గయ్యపేట నియోజకవర్గంలో పరిస్థితి అంతకు మించి ఉందంటున్నారు. సామినేని ఉదయభాను సొంత నియోజకవర్గం ఇది. ఇక్కడ నుంచి 2024లో వైసీపీ తరపున పోటీ చేసి టీడీపీ అభ్యర్ధి శ్రీరాం తాతయ్యపై ఓడిపోయారు ఉదయభాను.
ఎన్నికల తర్వాత జనసేనలో చేరినా… ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్యకు, భానుకు మధ్య గ్యాప్ మాత్రం అలానే ఉందట. జగ్గయ్యపేటలో ఎక్కడా ఉదయభాను జోక్యం అనేది ఉండకుండా శ్రీరాం తాతయ్య అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు చెబుతున్నారు. జిల్లాలో జరిగే ప్రభుత్వ కార్యక్రమాలను పక్కన పెడితే….కనీసం జగ్గయ్యపేటలో ఏ ప్రోగ్రామ్ జరిగినా… కూటమి భాగస్వామ్య పార్టీ నాయకుడిగా… ఉదయభానుకు కనీసం ఇన్విటేషన్ కూడా రావటం లేదట. అందుకు పూర్తి కారణం ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్యేనని, నియోజకవర్గంలో తమ నాయకుడి ఉనికి లేకుండా చేసే ప్రయత్నం జరుగుతోందని ఉదయభాను వర్గం గుర్రుగా ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. ఇదే విషయాన్ని జిల్లా ఇన్చార్జి మంత్రి, ఎంపీ దృష్టికి తీసుకెళ్ళినట్టు సమాచారం. వైసీపీలో అన్యాయం జరిగిందని పార్టీ మారితే…. చివరికి ఇక్కడ కూడా పరిస్థితులు ఇబ్బందికరంగా మారాయంటూ తెగ పీలైపోతున్నారట సామినేని.