Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ తీపికబురు అందించింది. అక్టోబర్ నెలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఆగస్టు 18వ తేదీ ఉదయం 9 గంటలకు విడుదల చేయనున్నట్లు టీటీడీ వెల్లడించింది. వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగే రోజులు మినహా మిగతా అన్ని రోజుల టికెట్లను విడుదల చేయనున్నట్లు ప్రకటనలో తెలిపింది. అక్టోబర్ నెలలో శ్రీవారిని దర్శించుకోవాలనుకునే భక్తులు tirupatibalaji.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ అధికారులు సూచించారు.
Read Also: సంతానం కలగాలంటే భార్యాభర్తలు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి?
అటు ఈనెల 18న టీటీడీ వాచీల ఈ-వేలం నిర్వహించనుంది. తిరుమల శ్రీవారి ఆలయంతోపాటు, ఇతర అనుబంధ ఆలయాలలో హుండీ ద్వారా భక్తులు కానుకగా సమర్పించిన వాచీలను ఈ-వేలంలో అందుబాటులో ఉంచుతారు. రాష్ట్ర ప్రభుత్వ కొనుగోలు పోర్టల్ ద్వారా 18న వాచీల ఈ-వేలం నిర్వహించనున్నామని, భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని టీటీడీ అధికారులు తెలిపారు. ఈ వేలంలో సీకో, హెచ్ఎంటీ, టైటాన్, సోనీ, క్యాషియో, టైమెక్స్, ఆల్విన్, సొనాటా, టైమ్‌వెల్, ఫాస్ట్‌ట్రాక్, సిటిజన్, రొలెక్స్‌తోపాటు ఇతర కంపెనీల వాచీలు ఉంటాయి. కొత్తవి, ఉపయోగించినవి, పాక్షికంగా పాడైన వాచీలు.. ఇలా వివిధ కేటగిరీలుగా వాచీలను భక్తులకు అందుబాటులోకి ఉంచుతారు.