పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అసెంబ్లీకి సైకిల్‌పై బయల్దేరారు. పేదల సొంతింటి కలను నెరవేర్చడానికి టీడీపీ ప్రభుత్వ హయాంలో నిర్మించిన టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు ఉచితంగా అందజేయాలని డిమాండ్ చేస్తూ రామానాయుడు సైకిల్ యాత్ర ప్రారంభించారు. నిమ్మల రామానాయుడు చేపట్టిన సైకిల్ యాత్ర పాలకొల్లు నుంచి అమరావతి సాగనుంది. ఆయనకు టీడీపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. పాలకొల్లులో తెలుగు మహిళ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రోజారమణి హారతిచ్చి ఎమ్మెల్యే నిమ్మల సైకిల్ యాత్రకు ఎదురు వచ్చారు. లాకుల వద్ద శ్రీ దేశాలమ్మ అమ్మవారికి పూజలు చేసి నిమ్మల బయలుదేరారు. పూలపల్లి వద్ద మహిళలు హారతులు ఇచ్చారు.
పాలకోడేరు, వీరవాసరం, భీమవరం, ఉండి మండల కేంద్రాల్లో నాయకులు పూలమాలలు వేశారు. వీరవాసరం మండల కేంద్రంలో టీడీపీ, జనసేన నాయకులు, ఉండిలో ఎమ్మెల్యే మంతెన రామరాజు, టీడీపీ నాయకులు స్వాగతం పలికారు. టిడ్కో గృహాల లబ్ధిదారులను రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తుందని, పూర్తయిన ప్లాట్లను వారికి వెంటనే అందజేయాలని యాత్ర చేపట్టినట్టు తెలిపారు.ప్రతి లబ్ధిదారుడికి టీడీపీ అండగా ఉంటుందన్నారు. జగన్ ప్రభుత్వం మెద్దునిద్రలో ఉందన్నారు. సీఎం జగన్ ప్రజల కష్టా లు, ఇష్టాలు తెలియకుండా పాలన సాగిస్తున్నారంటూ ఎద్దేవా చేశారు.