దొంగే దొంగా.. దొంగా.. అనే రీతిలో మొదటి నుంచీ వైఎస్ జగన్మోహన్‌రెడ్డి వ్యవహారం ఉంది.. ఆయన దోపిడీని దశల వారీగా బయటపెడతామన్నారు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.. మీడియాపై ఫ్రంట్ ఫుట్ బ్యాటింగ్ అంటున్న సీఎం జగన్.. క్లీన్ బౌల్డ్ లేదా స్టంప్ అవుట్ కాక తప్పదని మీడియా చిట్‌చాట్‌లో హెచ్చరించారు.. జగన్ కళ్ళు మూసుకుని ఆడే ఫ్రంట్ ఫుట్ తో బొక్కబోర్లా పడక తప్పదని వ్యాఖ్యానించారు లోకేష్.. వరద ప్రాంతాల్లో జగన్ పర్యటన బూటకంగా కొట్టిపారేసిన ఆయన.. మేం వేసిన సిమెంట్ రోడ్డుపైనే నిన్న జగన్ తిరిగారు.. వెనుక కార్లు కూడా వెళ్తుంటే ముందు ట్రాక్టరుపై జగన్ వెళ్లాల్సిన పనేముంది..? అని ఎద్దేవా చేశారు.. పోలవరం విలీన మండలాల్లో వాస్తవాలను చంద్రబాబు రేపు బయటపెడతారని.. విలీన ప్రాంతాల ప్రజలకు వైసీపీ ప్రభుత్వం ఏం చేసిందో తేటతెల్లమవుతుందన్నారు నారా లోకేష్.. కాగా, రేపటి నుంచి రెండు రోజుల పాటు విలీన ప్రాంతాల్లో చంద్రబాబు నాయుడు పర్యటించనున్న విషయం తెలిసిందే.
Read Also: YSRCP Clean Sweep: జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్..
మరోవైపు, మంగళగిరిలో 2400 మగ్గాలు ఉంటే కేవలం 200 మందికే నేతన్న నేస్తం వస్తుందని ఆరోపించారు.. ఎన్నికల ముందు చేనేత కార్మికులందరికీ నేతన్న నేస్తం ఇస్తామన్న జగన్ రెడ్డి.. చేనేత వర్గాన్ని మోసం చేశారని మండిపడ్డారు.. యార్న్ సబ్సిడీ, విద్యుత్ రాయితీలు, ఇతర సంక్షేమ కార్యక్రమాలు ఎత్తేశారన్న ఆయన.. ఆత్మహత్యలు చేసుకున్న నేతన్నల కుటుంబాలను ఆదుకోవాలని శాసన మండలిలో పెద్ద ఎత్తున పోరాడి ప్రభుత్వాన్ని నిలదీశానని.. అయినా, ప్రభుత్వంలో స్పందన లేదన్నారు.. సొంత మగ్గం ఉంటేనే నేతన్న నేస్తం ఇస్తామనడంతో ఎంతో మందికి నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. చేనేత రంగం పట్ల వైసీపీ ప్రభుత్వం చిన్నచూపు చూస్తుంది.. చేనేతల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదని ఫైర్ అయ్యారు. వర్షాకాలం మగ్గాల్లో నీరు చేరి ఉపాధి కోల్పోతున్న వారిని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు నారా లోకేష్.