Nara Lokesh: ఢిల్లీలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేశ్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా వైష్ణవ్ ను శాలువతో సత్కరించారు లోకేశ్. ఇక, ఏపీ మంత్రి వెంట కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్ర శేఖర్ తో పాటు టీడీపీ ఎంపీలు ఉన్నారు. ఇక, రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్న కేంద్రమంత్రులు, ఎంపీలను మంత్రి లోకేశ్ అభినందించారు. సమష్టి కృషితోనే ఏపీకి మేలని, కలిసికట్టుగా ఉండటం వల్లే విశాఖ స్టీల్ ను కాపాడుకోగలిగాం అని కేంద్ర మంత్రులు, పార్టీ ఎంపీలతో మంత్రి నారా లోకేశ్ చెప్పుకొచ్చారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో.. ఇక ముందు కూడా ఇదే పంథా కొనసాగించాలని సూచించారు. అనంతరం ఢిల్లీలో కేంద్ర మంత్రులు శ్రీనివాస వర్మ, రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, టీడీపీ ఎంపీలు, బీజేపీ నేతలతో నారా లోకేశ్ కాసేపు మాట్లాడారు.
Read Also: Delhi Assembly Election 2025: ఎన్నికల బరిలో ఉన్న ప్రముఖులు వీళ్లే!
అయితే, ఢిల్లీ పర్యటనకు వెళ్లిన నారా లోకేశ్ ను కేంద్ర మంత్రులు, పార్టీ ఎంపీలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడు నెలల్లోనే సమష్టి కృషితో విశాఖ రైల్వే జోన్, అమరావతి, పోలవరం, స్టీల్ ప్లాంట్ కు నిధులు తీసుకు రాగలిగామని చెప్పుకొచ్చారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర మంత్రులు, ఎంపీలు చేస్తున్న కృషిని ఆయన అభినందించారు. అతి తక్కువ కాలంలో విశాఖ స్టీల్ తో సహా అనేక సమస్యలు పరిష్కారం కావడం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని మంత్రులు, ఎంపీలతో నారా లోకేశ్ చెప్పారు.