ఏపీలో పాలనపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. ఏపీని బీహార్ కంటే దారుణమైన రాష్ట్రంగా మార్చేసింది వైసీపీ మాఫియా. వైసీపీ నాయకుల నేరాలు, ఘోరాలకి సామాన్యులు బలైపోతున్నారు. తన వద్ద డ్రైవరుగా పనిచేస్తున్న సుబ్రహ్మణ్యంని అత్యంత దారుణంగా హత్య చేసిన ఎమ్మెల్సీ అనంత బాబు, యాక్సిడెంట్ గా చిత్రీకరించే ప్రయత్నం చేయడం రాష్ట్రంలో జరుగుతున్న రాక్షస క్రీడకు అద్దం పడుతోందన్నారు లోకేష్.
ఎమ్మెల్సీ అనంత బాబు తమ కుమారుడ్ని బలవంతంగా తీసుకెళ్లి హత్య చేశాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నా అతన్ని పోలీసులు ఎందుకు అరెస్టు చేయలేదు. వైసీపీ ప్రజా ప్రతినిధులు, నాయకులకు హత్యలు, అరాచకాలు చేసుకోమని స్పెషల్ లైసెన్స్ ఏమైనా ప్రభుత్వం ఇచ్చిందా? సుబ్రహ్మణ్యంని హత్య చేసిన ఎమ్మెల్సీ అనంత బాబు, అతని అనుచరులను తక్షణమే అరెస్ట్ చేయాలి. హత్యపై సీబీఐ ఎంక్వైరీ వేయాలి. ఎంతో భవిష్యత్తు ఉన్న కొడుకుని కోల్పోయిన ఆ తల్లిదండ్రులను ప్రభుత్వం ఆదుకోవాలని లోకేష్ డిమాండ్ చేశారు.
అసలేం జరిగిందంటే..
ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ జిల్లాలో ఎమ్మెల్సీ కారులో మృతదేహం బయటపడడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. అది వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ్ బాబు వద్ద గతంలో డ్రైవర్‌గా పని చేసిన వీధి సుబ్రహ్మణ్యం మృతదేహంగా పోలీసులు గుర్తించారు. అర్థరాత్రి యాక్సిడెంట్ అయ్యిందని చెప్పి డ్రైవర్‌కి సమాచారం ఇచ్చిన ఎమ్మెల్సీ..స్వయంగా ఆయనే తన కారులో తెల్లవారు జామున రెండు గంటలకు మృతదేహాన్ని తీసుకొచ్చారు. డ్రైవర్ తల్లిదండ్రులు ఆందోళనకు దిగడంతో.. బాడీని, తన కారుని అక్కడే వెదిలేసి, మరో కారులో అనంత బాబు వెళ్ళిపోయారు.
రోడ్డు ప్రమాదంలో సుబ్రహ్యణ్యం చనిపోయాడని అనంత బాబు చెప్తుండగా.. తన బిడ్డను కొట్టి చంపి ఉంటారని డ్రైవర్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. నిన్న రాత్రి తమ ఇంట్లో పడుకున్న సుబ్రహ్మణ్యంను ఎమ్మెల్సీ అనుచరులు తీసుకెళ్ళారని కుటుంబీకులు చెప్తున్నారు. గతంలో అనంత బాబు వద్ద సుబ్రహ్మణ్యం ఐదేళ్ళు డ్రైవర్‌గా పని చేశాడు. కాగా.. నిన్న అనంతబాబు పుట్టిన రోజు సందర్భంగా ఆయన అనుచరులు పార్టీలో మునిగితేలారు. ఈ క్రమంలో సుబ్రహ్మణ్యం అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. అనంత బాబు ను వెంటనే అరెస్ట్ చేయాలని డ్రైవర్ కుటుంబీకులు ఆందోళన చేస్తున్నారు. కలెక్టర్, ఎస్పీ రావాలని పట్టుబడుతున్నారు. మరోవైపు కారులో భారీగా మందుబాటిల్స్ లభ్యం కావడంతో ఈ కేసు మరిన్ని మలుపులు తిరుగుతాయని భావిస్తున్నారు.