Srisailam Temple: కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా శ్రీశైలం దేవస్థానంలో భక్తుల రద్దీ భారీగా కనిపిస్తోంది. తెల్లవారుజాము నుంచే వేలాదిగా భక్తులు శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి దర్శనార్థం తరలివచ్చారు. పాతాళగంగ వద్ద భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తూ, కార్తీక మాసం పుణ్యకాలాన్ని సద్వినియోగం చేసుకున్నారు. గంగాధర మండపం వద్ద కార్తీక దీపాలను వెలిగిస్తూ భక్తులు శివనామ స్మరణలో తరిస్తున్నారు. భారీ రద్దీ దృష్ట్యా దేవస్థానం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. భక్తులందరికీ శ్రీ స్వామివారి అలంకార దర్శనం చేసే అవకాశం కల్పించారు. అమ్మవారి దర్శనానికి భక్తులు దీర్ఘ క్యూల్లో నిలిచారు. ప్రస్తుత పరిస్థితుల్లో శ్రీ స్వామి, అమ్మవారి దర్శనానికి సుమారు 4 గంటల సమయం పడుతున్నట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. ఇక, కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో శ్రీశైలం అంతా ఆధ్యాత్మిక వాతావరణంతో కిటకిటలాడుతోంది.
Read Also: NBK : బాలయ్యకు తెలంగాణ రాష్ట్ర మాజీ సీపీ CV ఆనంద్ క్షమాపణలు
మరోవైపు, పుణ్యప్రదమైన కార్తీక మాసంలో నాలుగో సోమవారం పర్వదినం రోజున కొత్తపేట నియోజకవర్గంలోని శైవ క్షేత్రాలన్నీ భక్త జనసంద్రంగా మారాయి. రుద్రుడు, త్రినేత్రుడు, భక్త సులభుడు అయిన ఆ ముక్కంటిని దర్శించుకునేందుకు తరలివచ్చిన భక్త కోటితో ‘ఓం నమఃశివాయ’, ‘హర హర మహాదేవ’ మంత్రాలు అన్ని ఆలయాలలో ప్రతిధ్వనించాయి. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జిల్లాలోని కొత్తపేట మండలంలోని పలివెల శ్రీ ఉమా కొప్పులింగేశ్వర స్వామి (స్వయంభూ) దేవాలయంలో వైభవం ఈరోజు ఉచ్ఛస్థితిలో నిలిచింది.వేకువ జాము నుండే పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకుని, జటాజూటధారి అయిన శివయ్యకు పంచామృతాలతో మహా రుద్రాభిషేకాలు నిర్వహించి, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.ముఖ్యంగా మహిళా భక్తులు భక్తి శ్రద్ధలతో ఆలయ ప్రాంగణంలో, ఉసిరి కొమ్మల వద్ద కార్తీక దీపాలను వెలిగించి, పరమేశ్వరుడి కృప కోసం మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ పరిసరాలన్నీ కార్తీక దీపాల కాంతులతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ ఈఓ పి. కామేశ్వరరావు గారి పర్యవేక్షణలో సిబ్బంది ఎలాంటి అసౌకర్యం లేకుండా, భక్తులకు సత్వర దర్శనం లభించేలా పటిష్టమైన ఏర్పాట్లు చేశారు.