జనసేన పార్టీ కీలక నేత నాదెండ్ల మనోహర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో వచ్చే ఏడాది మార్చిలోనే ఎన్నికలు రానున్నాయని నాదెండ్ల మనోహర్ జోస్యం చెప్పారు. మార్చిలోనే ఎన్నికలు జరగబోతుండటంతో జనసైనికులు సిద్ధంగా ఉండాలని ఆయన సూచించారు. రాష్ట్రం బాగుండాలంటే జగన్ను వచ్చే ఎన్నికల్లో ఓడించి తీరాలన్నారు. పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టింది వ్యక్తిగత లబ్ధి కోసం కాదని.. ప్రజల కోసం, ప్రజలకు సేవ చేయడం కోసమే ఆయన పార్టీ పెట్టారని నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.
వైసీపీ నేతలు లక్షల కోట్లు అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అంటే అక్కడకి పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా వస్తారని చెప్పారు. రైతులకు అండగా ఉండాలని ఏళ్ల తరబడి ప్రసంగాలే తప్ప ఆచరణ మాత్రం ప్రభుత్వాలు చేయడం లేదని నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. చనిపోయిన రైతుల కుటుంబాలకు పవన్ కళ్యాణ్ లక్ష రూపాయలు ఇస్తున్నారని తెలిపారు. జగన్ను ఇంటికి పంపటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. ప్రతి ఇంటిపై జనసేన జండా ఎగరాలని.. దానికి ప్రతి ఒక్క జనసైనికుడు కష్టపడి పనిచేయాలని సూచించారు. ప్రభుత్వం నుంచి తప్పుడు కేసులు ఎదుర్కొంటున్న జనసైనికులకు పార్టీ అండగా ఉంటుందని నాదెండ్ల మనోహర్ భరోసా కల్పించారు.