తెలంగాణ-ఆంధ్ర రెండు రాష్ట్రాల మత్స్యకారుల మధ్యలో నెలకొన్న సరిహద్దు వివాద సమస్యపై ప్రత్యేక దృష్టి సారించి సంబంధిత ఉన్నతాధికారులతో మాట్లాడి మత్స్యకారుల సమస్యను పరిష్కరిం చేందుకు ప్రత్యేక కృషి చేస్తానని నందికొట్కూరు ఎమ్మెల్యే తోగూరు ఆర్థర్ తెలిపారు. మంగళవారం కొత్తపల్లి మండలంలోని సంగమేశ్వరం పరిసర ప్రాంతంలో ఉన్న కృష్ణా నదిలో చేప పిల్లలను వదిలారు.
అనంతరం మత్స్యశాఖ జె.డి శ్యామలమ్మ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో మత్స్యకారుల నుద్దేశించి మాట్లాడుతూ ఎన్నోఏళ్ల నుంచి కృష్ణా నదిలో చేపల వేట చేస్తూ జీవనం సాగిస్తున్న ఈ ప్రాంత మత్స్యకారులకు గత కొంతకాలం నుంచి చేపల వేట విషయంలో రెండు రాష్ట్రాల మత్స్యకారులకు సమస్యలు వచ్చాయని తెలిపారు. మత్స్యకారులు అధైర్య పడకుండా ధైర్యంగా ఉండాలని భరోసా కల్పించారు. మత్స్యకారుల అభివృద్ధి కోసం ప్రభుత్వం నుంచి వస్తున్న పలు సంక్షేమ పథకాలను ప్రతి మత్స్యకారుడికి అందిస్తూ మత్స్యకారుల అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తానన్నారు. అనంతరం కృష్ణానదిలో 4 లక్షల చేప పిల్లలు రోహు కట్ల అనే రెండు రకాల చేపపిల్లలను ఎమ్మెల్యే వదిలారు.