వైసీపీ రెబల్ నేత, ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యవహారం ఇంకా హాట్ టిపిక్‌గానే సాగుతోంది.. ప్రభుత్వంపై ఆరోపణలు, కేసులు, అరెస్ట్, జైలు, ఆస్పత్రి, బెయిల్, ఫిర్యాదులు.. ఇలా కొనసాగుతూనే ఉంది.. ఇక, కాసేపటి క్రితమే లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లాతో సమావేశమయ్యారు ఎంపీ రఘురామకృష్ణరాజు… తనపై దాడి విషయంలో.. ప్రివిలేజ్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేసిన ఆయన.. సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు.. ఇక, వైసీపీ వెబ్‌సైట్‌లో తన పేరును తొలగించడాన్ని ఎంపీ రఘురామ ప్రస్తావించారు. మరోవైపు.. ఈ భేటీకి ముందే స్పీకర్‌కు రఘురామ లేఖ రాశారు. అనర్హత వేటుపై వైకాపా ఫిర్యాదును పరిగణనలోకి తీసుకోవద్దని కోరారు. ఫిరాయింపుల నిరోధక చట్టం కింద చర్యలు తీసుకోవద్దని ప్రస్తావించారు. ప్రభుత్వ తప్పులు ప్రస్తావించకుండా తన గొంతునొక్కే ప్రయత్నం చేస్తున్నారని వివరించారు.
కాగా, రఘురామకృష్ణరాజు పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయాలని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు లోక్‌సభలో వైకాపా చీఫ్ విప్ మార్గాని భరత్ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.. వైసీపీ టికెట్ మీద నర్సాపురం నుంచి ఎంపీగా ఎన్నికై, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.. రఘురామ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ చేసిన వ్యాఖ్యలపై గతంలోనే ఆధారాలను సమర్పించామని.. అనేక పర్యాయాలు డిస్ క్వాలిఫికేషన్‌కు సంబంధించి స్పీకర్‌ను కలిసి విజ్ఞప్తి చేశామన్నారు.. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని అతిక్రమించిన రఘురామకృష్ణరాజును వెంటనే డిస్క్వాలిఫై చేయాల్సిందిగా లోక్‌సభ స్పీకర్‌ను కలిసి భరత్ విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే.
మరోవైపు.. వైకాపా అధికారిక వెబ్‌సైట్‌లో ఉన్న ఆ పార్టీ ఎంపీల జాబితా నుంచి నరసాపురం ఎంపీ కె. రఘురామకృష్ణరాజు పేరును తొలగించారు.. రాజ్యసభ, లోక్‌సభకు కలిపి ఆ పార్టీ తరపున 28 మంది ఎంపీల పేర్లు గతంలోని వెబ్‌సైట్‌లోని జాబితాలో పొందుపరిచారు. తిరుపతి నుంచి ఇటీవలే ఎన్నికైన గురుమూర్తి పేరును కూడా ఎంపీల జాబితాలో చేర్చారు. అయితే, రఘురామకృష్ణరాజు పేరు ఇప్పుడు జాబితాలో లేదు. దీనిపై ఆ పార్టీ నుంచి ఎవరూ అధికారికంగా స్పందించలేదు. కానీ, ఈ అంశంతో పాటు వైకాపా ఫిర్యాదును ఎంపీ రఘురామ స్పీకర్ దృష్టికి తీసుకెళ్లారు.