చిన్నప్పటినుంచి చెస్ అంటే ఇష్టం ఏర్పడింది… చెస్ లో అద్బుత ప్రతిభ చూపిస్తూ పతకాల మీద పతకాలు సాధిస్తుంది…రాష్ట్రంలో మూడో ఉమెన్ ఫిడే మాస్టర్ గా అవతరించింది… ఇండియా నెంబర్ వన్ కావడంతోపాటు ఉమెన్ గ్రాండ్ మాస్టర్ అవడమే లక్ష్యంగా ముందుకెళ్తుంది.
చెస్ ఆడుతూ అద్భుతమయిన ప్రతిభ కనబరుస్తోంది మౌనిక అక్షయ. ఊరు గుంటూరు. తల్లితండ్రులు రామారావు, లక్ష్మిలు. ఇద్దరూ కలిసి స్కూల్ నిర్వహిస్తున్నారు. తల్లిదండ్రులు చెస్ ఆడడం చూసిన మౌనిక అక్షయ ఆ ఆటపై ఎంతో ఆసక్తి పెంచుకుంది. ఆరేళ్ల వయసులో తల్లితండ్రులతో చెస్ ఆడడం మొదలుపెట్టింది.
మౌనిక అక్షయ ఆసక్తి గమనించిన తల్లితండ్రులు గుంటూరులోనే చెస్ కోచ్ వద్ద శిక్షణ ఇప్పించారు. జిల్లా స్థాయిలో అండర్-8 ఛాంపియన్ గా నిలిచింది. తర్వాత స్టేట్ లెవల్ చెస్ ఛాంపియన్ షిప్ లో థర్డ్ ప్లేస్ లో నిలిచింది. 2010లో జరిగిన నేషనలెవల్ ఛాంపియన్ షిప్ లో పదోస్థానం సాధించడం ద్వారా వరల్డ్ చెస్ ఛాంపియన్ షిప్ లో పాల్గొనేందుకు అర్హత సాధించింది. 2014లో బ్రెజిల్ లో జరిగిన వరల్డ్ స్కూల్స్ అండర్ 11బాలికల చెస్ ఛాంపియన్ షిప్ లో రజత పతకం సాధించింది.

అదే ఏడాది తైవాన్ లో జరిగిన వరల్డ్ స్కూల్ అండర్ 11 బాలికల చెస్ ఛాంపియన్ షిప్ లో గోల్డ్ మెడల్ సాధించింది. 2015లో సింగపూర్ లో జరిగిన ఏషియన్ ఏజ్ గ్రూప్ అండర్ 12 గర్ల్స్ చెస్ ఛాంపియన్ షిప్ లో వివిధ కేటగిరీల్లో మూడు గోల్డ్, ఒక రజతపతకం, మరో కాంస్యపతకం సాదించింది. 15దేశాల్లో జరిగిన పోటీల్లో పాల్గొని అనేక పతకాలు సాధించింది. ఈ ఏడాది జనవరిలో స్పెయిల్ జరిగిన 3వ విమ్ నార్మ్ సాధించి ఉమెన్ ఇంటర్నేషనల్ మాస్టర్ గా అవతరించింది. రాష్ట్రంలో ఈ ఘనత అందుకున్న మూడో చెస్ క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది. ఉమెన్ గ్రాండ్ మాస్టర్ అవడంతోపాటు ఇండియా నెంబర్ వన్ చెస్ క్రీడాకారిణి అవడమే తన లక్ష్యమంటుంది.
అక్షయ మౌనిక ఉమెన్ గ్రాండ్ మాస్టర్ అవడం కోసం తమిళనాడుకు చెందిన గ్రాండ్ మాస్టర్ శ్యాంసుందర్, ఒడిషాకు చెందిన మరో గ్రాండ్ మాస్టర్ స్వంయంశ్ మిశ్రాల వద్ద ఆన్ లైన్ లో శిక్షణ తీసుకుంటుంది. అయితే శిక్షణకు ఖర్చు ఎక్కువ అవుతుంది. అంత స్తోమత లేకపోవడంతో తండ్రి రామారావు స్నేహితులు కొంత ఆర్ధిక సాయం అందిస్తున్నారు.అయితే ఉమెన్ గ్రాండ్ మాస్టర్ అవ్వాలంటే విదేశాల్లో జరిగే టోర్నీల్లో అడితే త్వరగా గ్రాండ్ మాస్టర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చెస్ లో అద్బుత ప్రతిభ చూపిస్తున్న తమ కూతురికి ప్రభుత్వం నుంచి సాయం అందితే, రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు తీసుకొస్తుందంటున్నారు అక్షయ మౌనిక తల్లిదండ్రులు.