జునిపెర్ నెట్‌వర్క్స్ క్లౌడ్ & ఆటోమేషన్ అకాడమీ (జెఎన్‌సిఎఎ) మరియు స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, విఐటి-ఎపి విశ్వవిద్యాలయాల మధ్య అవగాహన ఒప్పందం (ఎంఒయు) సంతకం కార్యక్రమం మే 25, 2021 మంగళవారం నాడు వర్చ్యువల్ విధానంలో జరిగింది.
జెఎన్‌సిఎఎతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత విఐటి-ఎపి విశ్వవిద్యాలయం వైస్-ఛాన్సలర్ డా|| ఎస్ వి కోటా రెడ్డి మాట్లాడుతూ ఈ సహకారం అధ్యాపకులకు మరియు విద్యార్థులకు జునిపెర్ ట్రైనింగ్ & సర్టిఫికేషన్ పొందడానికి సహాయపడుతుందని అన్నారు. ఈ సహకారంతో క్లౌడ్ & నెట్‌వర్కింగ్ రంగంలో పరిశోధన మరియు కెరీర్ అవకాశాలతో కూడిన 10 ఇండస్ట్రీ డిమాండ్ కోర్సులలో శిక్షణ మరియు సర్టిఫికేషన్ పొందవచ్చని తెలియచేసారు. విఐటి-ఎపి విశ్వవిద్యాలయం నుండి జునిపెర్ ప్రోగ్రామ్ సర్టిఫికేట్ పొందిన విద్యార్థులకు సూపర్ డ్రీం నియామక సమయంలో జునిపెర్ బృందం అదనపు ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు.
జునిపెర్ నెట్‌వర్క్స్ క్లౌడ్ & ఆటోమేషన్ అకాడమీ ప్రోగ్రామ్ మేనేజర్ శ్రీమతి అర్చన యాదవ్ మాట్లాడుతూ ఈ అవగాహన ఒప్పందం ద్వారా విఐటి-ఎపి విశ్వవిద్యాలయ విద్యార్థులు శిక్షణ మరియు సర్టిఫికేట్ రెండింటినీ ఉచితంగా పొందవచ్చని తెలియచేసారు అంతే కాకుండా ఈ సహకారంతో ఫాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, జాతీయ మరియు అంతర్జాతీయ సదస్సులు, సింపోసియంలు, వర్క్‌షాపులు నిర్వహించవచ్చని తెలిపారు.
విఐటి-ఎపి విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డా||.సి.ఎల్.వి. శివకుమార్ మరియు స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ డీన్ డా|| హరి సీత, అధ్యాపకులు, సిబ్బంది మరియు విద్యార్థులు వర్చ్యువల్ విధానంలో పాల్గొన్నారు.