Ambati Rambabu: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటనపై మంత్రి అంబటి రాంబాబు తీవ్ర విమర్శలు చేశారు. ఏపీలో విశాఖ ప్రధానమైన నగరం అని.. పర్యాటకులు ఎక్కువగా వెళ్లే నగరం అని.. ఇలాంటి ప్రశాంతమైన నగరాన్ని అలజడి నగరంగా తయారైన పరిస్థితికి కారణం పవన్ కళ్యాణ్ అని ఆరోపించారు. చంద్రబాబు నుంచి ప్యాకేజీ తీసుకుని పవన్ కళ్యాణ్ ఇవన్నీ చేస్తున్నారని.. రైతుల పాదయాత్ర పేరుతో విశాఖపై దాడి చేయించటానికి చంద్రబాబు ఓ వైపు ప్రయత్నం చేస్తున్నారని మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. పాదయాత్ర చేస్తున్న వాళ్ళు తొడలు కొడుతున్నారని.. మీసాలు తిప్పుతున్నారని అన్నారు. పవన్ కళ్యాణ్ బాబు వాణి వినిపించటానికే వైజాగ్ వచ్చాడని.. మంత్రుల మీద దాడి చేసిన జనసేన నాయకులకు సన్మానం చేయాలా అని మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు. చంద్రబాబు మాత్రం పవన్‌కు ఆర్ధిక సన్మానం కూడా చేస్తాడన్నారు.
Read Also: Baba Ramdev: సల్మాన్‌ఖాన్ డ్రగ్స్ తీసుకుంటాడు.. బాబా రాందేవ్ సంచలన వ్యాఖ్యలు
ఎయిర్ పోర్ట్ దగ్గర దాడి జరిగిన తర్వాత పవన్ కళ్యాణ్ ర్యాలీగా ఎలా వెళ్తాడని మంత్రి అంబటి రాంబాబు నిలదీశారు. ఎవరైనా రాయి విసిరితే.. బాధ్యత ఎవరిది అన్నారు. అసాంఘిక శక్తులను ప్రోత్సహిస్తున్న పవన్ కళ్యాణ్, చంద్రబాబు మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందన్నారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు ఒక బానిస అని విమర్శించారు. విశాఖ ఎయిర్‌పోర్టులో మంత్రులపై జరిగిన దాడిని పవన్ కళ్యాణ్ ఎందుకు ఖండించలేదని.. ఎందుకు ఈ సైకో చేష్టలు అని మండిపడ్డారు. పవన్ తన భస్మాసుర హస్తం తనమీదే పెట్టుకుంటున్నాడన్నారు. పవన్‌ది జనసేన కాదని బాబుసేన అని ఎద్దేవా చేశారు. ఏ పార్టీకి అయినా కార్యకర్తలు ఉంటారని.. జనసేన పార్టీకి సైనికులు ఉండటమేంటని నిలదీశారు. హింసకు పాల్పడితే పోలీసులు చూస్తూ ఊరుకోరని.. హింసను ప్రేరేపించే ఏ రాజకీయ పార్టీ బతికి బట్టకట్టదన్నారు.
అటు పవన్ కళ్యాణ్ మూడో పెళ్లి కామెంట్లపై మంత్రి అంబటి రాంబాబు రియాక్షన్ ఇచ్చారు. మూడు పెళ్ళిళ్ళు పవన్ కళ్యాణ్ వ్యక్తిగత విషయమని.. మూడు కాకపోతే నాలుగు పెళ్లిళ్లు చేసుకోమనండి.. అవసరమైన వాళ్లు విడాకులు తీసుకుంటున్నారని.. పవన్ సలహాలు తమకెందుకు అని మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. దేశంలోని ఇతర నగరాలతో పోటీ పడుతున్న విశాఖను రాజధానిగా ప్రకటిస్తే ఎందుకు వ్యతిరేకిస్తున్నారని ఆయన ప్రశ్నించారు.
