ఇటీవల ఏపీ ప్రభుత్వం ప్రకటించిన 11వ పీఆర్సీపై గందరగోళం నెలకొంది. చరిత్ర ఇటువంటి పీఆర్సీ ప్రకటన చూడలేదని, న్యాయమైన తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ సమ్మెకు పిలుపునిచ్చారు. అయితే పీఆర్సీపై ఉద్యోగ సంఘాలను నచ్చజెప్పేందుకు ఏపీ ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. అంతేకాకుండా ఉద్యోగ సంఘాలు పీఆర్సీలో తమకు జరుగుతున్న అన్యాయాన్ని తెలిపేందుకు ఈ కమిటీ ఉద్యోగ సంఘాల నేతలను ఈరోజు చర్చకు ఆహ్వానించింది. అయితే కమిటీ ఇచ్చిన ఆహ్వానాన్ని ఉద్యోగ సంఘాలు తిరస్కరించాయి. అయితే ప్రస్తుతం సెక్రటేరియేట్ లోనే బుజ్జగింపుల కమిటీ ఉద్యోగ సంఘాల నేతల కోసం వేచిచూస్తున్నారు.
అయితే అసోసియేషన్ కార్యాలయాల్లో ఉద్యోగ సంఘ నేతలు ఉండిపోయారు. చెప్పినట్టుగానే సచివాలయంలో మంత్రులు బొత్స, పేర్ని, ఇతర అధికారులు అందుబాటులో ఉన్నారు. చర్చలకు వచ్చేదే లేదని ఉద్యోగ సంఘ నేతలు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ముందుగా చెప్పిన్నట్టుగానే మధ్యాహ్నం 3 గంటలకు సమ్మె నోటీసును సీఎస్ సమీర్ శర్మకు పీఆర్సీ సాధన సమితి ఇవ్వనుంది. అయితే సీఎస్ అందుబాటులో లేకపోవడంతో జీఏడీ సెక్రటరీ శశిభూషణ్ కు పీఆర్సీ సాధన సమితి నోటీసును అందజేయనుంది.