CPS Employees Meeting With Ministers: మంత్రి బొత్స సత్యనారాయణతో సీపీఎస్ ఉద్యోగుల చర్చలు ముగిశాయి. ప్రభుత్వంతో చర్చలు విఫలమయ్యాయని సీపీఎస్ ఉద్యోగులు వెల్లడించారు. చాలా ఆశలతో చర్చలకు వచ్చిన తమకు సర్కారు పాత విషయాలనే చెప్పిందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ ప్రభుత్వం జీపీఎస్‌పైనే చర్చించాలని చెప్పిందని ఉద్యోగులు తెలిపారు. తామంతా ఓపీఎస్ విధానం కావాలని మంత్రులకు చెప్పామన్నారు. సీపీఎస్ రద్దు చేస్తే కేంద్రం నుంచి నిధులు రావని మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిలు ఉద్యోగులతో అన్నారు. ఈ నేపథ్యంలో సీపీఎస్ ఉద్యోగుల ఆందోళనలు కొనసాగుతాయని పలు సంఘాల నేతల తెలిపారు. సెప్టెంబర్ 1న సీపీఎస్ ఉద్యోగులు తలపెట్టిన చలో విజయవాడ, సీఎం నివాసం ముట్టడి యధావిధిగా జరుగుతాయన్నారు.
ప్రభుత్వం ప్రతిపాదించిన జీపీఎస్ విధానంలో మార్పు చేర్పులు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఓపీఎస్ విధానంలోనూ కొంత మేర తగ్గడానికి ఉద్యోగులు అంగీకరించారన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 95 శాతం హామీలను మేర నెరవేర్చిందని.. నెరవేర్చని 5 శాతం హమీల్లో సీపీఎస్ రద్దు అంశం ఒకటన్నారు. సీపీఎస్ ఉద్యోగులకు చంద్రబాబు ప్రభుత్వంలో ఇచ్చిన ప్రతిపాదనల పైనా చర్చించేందుకు కూడా సిద్ధంగా ఉన్నామన్నారు. సెప్టెంబర్ 1వ తేదీన సీపీఎస్ ఉద్యోగుల ఆందోళనలను దృష్టిలో ఉంచుకుని ఈ చర్చలు నిర్వహించలేదన్నారు. పాత పెన్షన్ విధానం రాష్ట్రాలకు ఆర్థిక భారంగా మారుతుందని కేంద్రం సీపీఎస్ విధానాన్ని ప్రవేశ పెట్టిందన్నారు. ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలతో పాటు 5 కోట్ల ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకోవాలన్నారు. గురువులను గౌరవించుకోవడానికే ప్రభుత్వం ఎడ్యు ఫెస్ట్ 2022 నిర్వహిస్తోందన్నారు. ఎడ్యు ఫెస్ట్ నిర్వహణ సీపీఎస్ ఉద్యోగుల ఆందోళనలను అడ్డుకోడానికి కాదని మంత్రి బొత్స వెల్లడించారు.
Tollywood: టాలీవుడ్ పై బీజేపీ కన్ను.. మొన్న ఎన్టీఆర్.. రేపు నితిన్
అసలేం జరిగిందంటే..: కాంట్రిబ్యూటరీ పింఛన్ పథకాన్ని (సీపీఎస్) రద్దు చేయాలనే డిమాండ్‌తో సీపీఎస్ ఉద్యోగ సంఘాలు ఆందోళనలకు సిద్ధమయ్యాయి. సీపీఎస్ విధానం అమల్లోకి వచ్చిన సెప్టెంబరు 1న సీపీఎస్ ఉద్యోగుల సంఘం (సీపీఎస్‌యూఎస్) సీఎం జగన్ ఇంటి ముట్టడికి పిలుపునిచ్చింది. మరోవైపు సీపీఎస్ ఎంప్లాయిస్ అసోసియేషన్ (సీపీఎస్‌ఈఏ) విజయవాడలో భారీ సభకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ కార్యక్రమాలకు పోలీసులు అనుమతులు ఇవ్వలేదు. అయినా ఆందోళనలు కొనసాగించాలని సీపీఎస్ ఉద్యోగ సంఘాలు సమాయత్తమవుతుండగా.. అడ్డుకోవడానికి పోలీసులు అడుగడుగునా నిర్బంధాలు మొదలుపెట్టారు. ఆందోళనలను వాయిదా వేయించేందుకు సీపీఎస్ ఉద్యోగ సంఘాల నేతలతో మంత్రులు చర్చలు జరిపారు.
మంత్రి బొత్స సత్యనారాయణ విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో బుధవారం ఏపీసీపీఎస్‌యూఎస్ ఉద్యోగ నాయకులతో రెండు గంటలపాటు చర్చించారు. సీపీఎస్, జీపీఎస్, ఓపీఎస్ విధానంలో ఉన్న తేడాలను నాయకులు మంత్రికి వివరించారు. సీపీఎస్‌ఈఏను చర్చలకు ఆహ్వానించగా ఓపీఎస్‌పై తప్ప, జీపీఎస్‌పై మాట్లాడేందుకు తాము రాబోమని తిరస్కరించారు. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డితో కలిసి శుక్రవారం మరోసారి చర్చలు నిర్వహించారు.