Vidadala Rajini: గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎయిమ్స్‌ను సోమవారం మధ్యాహ్నం వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజినీ సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎయిమ్స్‌కు ఇవ్వాల్సిన బేసిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంతా ప్రొవైడ్ చేశామని తెలిపారు. రోడ్లు, ఎలక్ట్రిసిటీ, వాటర్, డ్రైనేజ్ సిస్టం కోసం సుమారుగా రూ.50 కోట్లను ఖర్చు చేశామని మంత్రి విడదల రజినీ వెల్లడించారు. పొల్యూషన్ బోర్డ్, ఫారెస్ట్ డిపార్టుమెంట్ క్లియరెన్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేసిందని పేర్కొన్నారు. త్వరలోనే ఎయిమ్స్‌లో కూడా ఆరోగ్యశ్రీని ప్రవేశపెడతామని స్పష్టం చేశారు. ఎయిమ్స్ ఆస్పత్రికి సంబంధించిన టెంపరరీ వాటర్ ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుందని మంత్రి విడదల రజినీ వెల్లడించారు. పర్మినెంట్ వాటర్ సొల్యూషన్‌ను రూ.7.74 కోట్లతో ఆత్మకూరు పంచాయతీ నుంచి వాటర్ పైప్ లైన్ సిస్టం పనులను సోమవారం నుంచే ప్రారంభించామని తెలిపారు.
Read Also: YSR Statue : మంగళగిరిలో వైఎస్సార్ విగ్రహాన్ని తొలగించిన అధికారులు
మరోవైపు సీఎం జగన్ పాదయాత్ర చేసి ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా చిలకలూరిపేట వైఎస్ఆర్‌సీపీ కార్యాలయంలో మంత్రి విడదల రజినీ భారీ కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో లేని విధంగా తమ ప్రభుత్వంలో విద్య, వైద్యం ఉచితంగా అందిస్తున్నామని తెలిపారు. చంద్రబాబు హయాంలో ప్రజలకు చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. తమ పార్టీ హయాంలో రూ.1,80,000 కోట్లను సంక్షేమానికి ఉపయోగిస్తున్నామని వివరించారు. సంక్షేమ పథకాలలో భాగంగా అమ్మ ఒడి నగదును నేరుగా తల్లుల ఖాతాలలో వేస్తున్నామని గుర్తుచేశారు. ప్రజా సంకల్ప యాత్రలో ప్రజల కష్టాలు తెలుసుకున్న సీఎం జగన్ వాటిని మేనిఫెస్టోగా రూపొందించి నవరత్నాలను ప్రజలకు అందిస్తున్నారని కొనియాడారు.