ఏపీలో బీజేపీ వర్సెస్ వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే వుంది. గుంటూరులో జిన్నా టవర్ అంశం ఇరు పార్టీ నేతల మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమనే విధంగా మారింది. ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుకు మంత్రి వెల్లంపల్లి కౌంటర్ ఇచ్చారు. ఈమేరకు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ట్వీట్ చేశారు.
2014–19 మధ్య రాష్ట్రంలో అధికారాన్ని అనుభవించిన బీజేపీకి గుంటూరులో జిన్నా టవర్ ఉందని గుర్తుకు రాలేదు. స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్ల తరవాత, గుంటూరులో 100 ఏళ్ళ క్రితం నిర్మించిన టవర్ గురించి గొడవపెడుతున్నారంటే… ఇంతకంటే దిగజారుడు ఉంటుందా? అని కౌంటర్ అటాక్ చేశారు మంత్రి వెల్లంపల్లి.
అంతకుముందు బీజేపీ ఏపీ చీఫ్ సోము వీర్రాజు- వైసీపీ నేతల మధ్య డైలాగ్ వార్ నడిచింది. జాతీయ జెండా ఎగరేయనీకుండా వైసీపీ ప్రభుత్వం, పోలీసులు తీవ్రవాదుల్లాగా అడ్డుకుంటున్నారు. గుంటూరు భారతదేశంలోనే ఉంది. త్వరలోనే జిన్నా సెంటర్లో బీజేపీ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి చూపిస్తుంది.. అడ్డుకునే దమ్ముందా..? కాశ్మీర్ లో తీవ్రవాదులను ఎదుర్కొని లాల్ చౌక్ లో జాతీయ జెండాను ఎగురవేసిన ఘనత బీజేపీది.
Read Also కొడాలి నాని లక్ష్యంగా.. చంద్రబాబు అండ్ కో.. దుర్మార్గ చర్యలు: మంత్రి కన్నబాబు
జాతీయ వాదులను అరెస్టులతో నిలువరించలేరు.జిన్నా టవర్ వద్ద జాతీయ పతాకాన్ని ఎగురవేయనీయకుండా బీజేపీ నేతలను అడ్డుకుని గృహ నిర్బంధం చేయడం తగదు. జగన్ పాలనలో కనీసం జాతీయ జెండాను ఎగురవేయడానికి కూడా అనుమతించకపోవడం ప్రభుత్వ నిరంకుశత్వాన్ని తెలియజేస్తోంది అని సోము వీర్రాజు మండిపడ్డారు. దీనికి కౌంటరేశారు మంత్రి వెల్లంపల్లి.