Minister Roja Sensational Comments On TDP: ఏపీ మంత్రి రోజా తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ నాయకులకు పనీ పాట లేదని, వారి ఛానల్స్‌లో ప్రెస్‌మీట్లు పెట్టి ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని మండిపడ్డారు. మూడేళ్లుగా ప్రశ్నోత్తరాల సమయాన్ని వృధా చేస్తున్నారని ఆగ్రహించారు. ఉద్యోగాల గురించి అడిగే అర్హత చంద్రబాబుకు లేదని, తన హయాంలో ఆయన ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారని ప్రశ్నించారు. రాష్ట్రంలో కోటి 80 లక్షల ఇళ్లున్నాయని.. ఎంతమందికి బాబు ఉద్యోగాలు ఇవ్వడంతోపాటు నిరుద్యోగ భృతి ఇచ్చారని నిలదీశారు. వైఎస్ జగన్ సీఎం అయ్యాక.. టీడీపీకి బుద్దొచ్చే విధంగా లక్షా 21 వేల సచివాలయ ఉద్యోగాలు ఇచ్చామన్నారు. రాష్ట్రంలో లక్షల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ఒక్క వైసీపీ ప్రభుత్వానిదే అని.. టీడీపీ నేతలు గ్రామాల్లో తిరిగితే, ఎంతమంది యువతకు ఉద్యోగాలు వచ్చాయో తెలుస్తుందని చెప్పారు. వైద్య ఆరోగ్య శాఖలో 42 వేల పోస్టులను భర్తీ చేయడంతో పాటు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి ఉద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపామన్నారు.
మూడు రాజధానులతో మూడు ప్రాంతాలను అభివృద్ధి చేయాలనేదే సీఎం జగన్ లక్ష్యమని మంత్రి రోజా తెలిపారు. మూడు రాజధానుల అంశం లేవనెత్తిన తర్వాత.. వచ్చిన ప్రతి ఎన్నికల్లో తామే గెలిచామన్నారు. రాజధానిలో ఉన్న రెండు ఎమ్మెల్యే సీట్లను సైతం వైసీపీ గెలిచిందని గుర్తు చేశారు. మీరు (టీడీపీ) న్యాయం చేయలేరు కాబట్టే ప్రజలు తమని గెలిపించారన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే 26 గ్రామాల్లో రాజధాని కావాలంటున్నారని చెప్పిన రోజా.. 26 జిల్లాల్లో టీడీపీని ప్రజలు కూకటి వేళ్లతో పీకి పారేస్తారని హెచ్చరించారు. ‘దమ్ముంటే రాజీనామా చేయండి.. అసెంబ్లీ రద్దు చేయండి’ అని తమని ఎందుకు అడుగుతున్నారని ప్రశ్నించారు. అమరావతి కావాలా, మూడు ప్రాంతాలు కావాలా అని ప్రజలను టీడిపి నేతలు అడగాలన్నారు. ఇదే సమయంలో నారా లోకేష్‌పై ధ్వజమెత్తారు. లోకేష్ ఒక పిల్లి పిత్రి అని.. తల్లి, భార్య సహాయంతో చంద్రబాబును బెదిరించి, దొడ్డి దారిన మంత్రి అయ్యాడని, అలాంటి నువ్వు సీఎం జగన్‌ని విమర్శిస్తావా? అంటూ రోజా తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. లోకేష్ ఒక అడ్రస్ లేని వెధవ అని.. ఏది పడితే అది మాట్లాడితే జనాలు కొట్టిస్తామని రోజా వార్నింగ్ ఇచ్చారు.
తాను, కొడాలి నాని టీడీపీ నుంచే వచ్చామని.. నాడు ఎన్టీ రామారవు అభిమానులుగా తాము టీడీపీలో ఉన్నామని రోజా చెప్పారు. కొడాలి నాని మాట్లాడిన మాటల్లో తప్పేముందని ప్రశ్నించిన ఆమె.. ఆయనపై ఈగ వాలితే సహించేది లేదని హెచ్చరించారు. కొడాలి నాని గడ్డంలో తెల్ల వెంట్రుక కూడా పీకలేరన్నారు. టీడీపీ నేతలు ఎవరైనా వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లపైకు వస్తే తరిమి తరిమి కొడతామన్నారు. జగనన్న కోసం తాము ప్రాణాలివ్వడానికైనా సిద్ధమన్నారు. మూడు రాజధానుల బిల్ పెట్టే దమ్ము ప్రభుత్వానికి ఉందా అని టిడిపిఎల్పీ సమావేశంలో చర్చించారని.. ప్రజల మద్దతు ఉంది కాబట్టే మూడు రాజధానుల విషయాన్ని ప్రభుత్వం ప్రస్తావిస్తోందన్నారు. అందుకే రాజధాని ప్రాంతం సహా రాష్ట్రవ్యాప్తంగా వివిధ ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించిందన్నారు.