Minister Roja: ఏపీలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ యాత్ర చేపట్టనున్న వారాహిపై అధికార పార్టీ వైసీపీ, జనసేన మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ అంశంపై పవన్ వరుసగా ట్వీట్లు చేసి వైసీపీపై విమర్శలు చేయగా.. తాజాగా మంత్రి రోజా ఆయనకు కౌంటర్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ వాహనం వారాహి కాదు నారాహి అంటూ సెటైర్ వేశారు. ఆయన వాహనం కలర్, చొక్కా కలర్ గురించి ఎవరూ పట్టించుకోవడం లేదని.. ఎందుకంటే ఆయన కలర్ పసుపు అని అందరికీ తెలిసిపోయిందన్నారు. పవన్ కళ్యాణ్ దత్త పుత్రుడు అని.. ఆయన ప్యాకేజీ స్టార్ అని విమర్శలు చేశారు. అంతేకాకుండా కత్తులతో పవన్ ఎవరిపై యుద్ధం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నాడని ఎద్దేవా చేశారు. పవన్‌కు సొంతంగా 175 స్థానాల్లో పోటీ చేసే దమ్ము, ధైర్యం లేవన్నారు. ఎవరి సైన్యంలో దూరి యుద్ధం చేయాలని పవన్ చూస్తున్నారని మంత్రి రోజా ప్రశ్నించారు.
Read Also: Kollu Ravindra: వైసీపీకి బీసీల దమ్మేంటో త్వరలోనే చూపిస్తాం
పవన్ కళ్యాణ్ వాహనం వారాహిని చూసి తాము భయపడుతున్నామని స్పీకర్‌గా పనిచేసిన నాదెండ్ల మనోహర్ చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని మంత్రి రోజా అన్నారు. అసలు పవన్ కళ్యాణ్‌కే తాము భయపడటం లేదని చెప్తుంటే ఆయన వాహనానికి ఎలా భయపడతామని నిలదీశారు. ఆయన వారాహిలో వస్తారా.. కార్వాన్‌లో వస్తారా అన్న విషయం తమకు అనవసరమని రోజా చెప్పారు. తమ నాయకుడు జగన్ దమ్ము, ధైర్యం ఉన్న నాయకుడు అని.. 175 స్థానాల్లో అభ్యర్థులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారని.. పవన్‌కు ఆ ధైర్యం ఉందా అని సూటి ప్రశ్న వేశారు. పవన్ వ్యాఖ్యలపై సీఎం జగన్ స్పందించాల్సిన అవసరం లేదన్నారు. మీడియా అనవసరంగా పవన్‌కు ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి రోజా అన్నారు. హైదరాబాద్‌లో బతికే పవన్ శ్వాస తీసుకోవాలా వద్దా అనేది చెప్పాల్సింది కేసీఆర్, కేటీఆర్ అని రోజా తెలిపారు. చంద్రబాబు కోసం దత్తపుత్రుడు పని చేస్తున్నాడని.. వచ్చే ఎన్నికల్లో 175 స్థానాలు గెలిచి పవన్, చంద్రబాబులను హైదరాబాద్‌కు జగన్ పంపడం ఖాయమన్నారు. పవన్ కళ్యాణ్‌కు రాష్ట్ర ప్రజలపైనా, తన పార్టీపైనా ప్రేమ లేదని రోజా ఆరోపించారు.