టీడీపీ అధినేత చంద్రబాబు ఈ రోజు కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబు పర్యటనపై పలు వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేవలం ఎన్నికలప్పుడే చంద్రబాబు కుప్పంకు వచ్చే వారని, ఈరోజు గ్రామాలు తిరగాలని చంద్రబాబు ఆలోచన చేశారన్నారు. ఏడు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నా ఇంకా కుప్పంలో చంద్రబాబు పర్యటించని గ్రామాలు ఉన్నాయని, సీఎం వైఎస్ జగన్ ఆధ్వర్యంలో మేము మా ఎమ్మెల్యేలు అన్ని గ్రామాలు తిరుగుతున్నామన్నారు. కేవలం ఒడిపోతామన్న భయంతో, అభద్రతా భావంతో మూడు రోజుల కుప్పం పర్యటన పెట్టుకున్నారని ఆయన అన్నారు. చంద్రబాబు కుప్పం బాట పట్టడం మా నైతిక విజయం అని ఆయన అన్నారు.
తలకిందులుగా తపస్సు చేసిన చంద్రబాబు కుప్పం లో గెలవడని కుప్పం ప్రజలకు తెలుసు, ఖచ్చితంగా కుప్పంలో గెలిచే పరిస్థితి లేకుండా చూస్తాం, సీఎం వైఎస్ జగన్ పేరును భ్రష్టు పట్టించాలని చంద్రబాబు ఆలోచన చేస్తున్నారని ఆయన విమర్శించారు. 14 ఏళ్ళు చంద్రబాబు సీఎంగా ఉన్నా వైఎస్ జగన్ సీఎం అయ్యే వరకు అర్హులకి ఇల్లు, పెన్షన్లు అందలేదని, కేవలం పేదరికం కొలమానంగా చూసి అర్హులకు పధకాలు అందిస్తున్నామన్నారు. పల్లెబాట కార్యక్రమం చేపడితే గ్రామాల్లో ఇబ్బందులు ఉన్నాయని చెప్పే పరిస్థితి లేదని, 14ఏళ్ళు సీఎంగా ఉండి ఈపని చేశా, ఆ ప్రాజెక్ట్ కట్టా అని చెప్పే గొప్ప పనులు చంద్రబాబు చేయలేదన్నారు. కేవలం నిరాశ, నిస్పృహతో సీఎం వైఎస్ జగన్ పై చంద్రబాబు విరుచుకుపడుతున్నారని ఆయన మండిపడ్డారు.