Minister Nimmala: మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైఖరిని రాయలసీమ ప్రజలే తప్పు పడుతున్నారు అని జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. రాయలసీమలో ప్రతి ప్రాజెక్ట్ టీడీపీ హయాంలోనే వచ్చాయి.. ఇవాళ వైసీపీ తమను ప్రశ్నిస్తోంది కదా.. గత ఐదేళ్లలో రాయలసీమకు మీరు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. కేవలం సినిమా సెట్టింగులు వేసి.. పూర్తి కానీ ప్రాజెక్టులను ప్రారంభించారని ఆరోపించారు. వైసీపీ పత్రికల్లో దుష్ప్రచారం చేస్తున్నారు.. ఏపీ ప్రజలు తెలివైనవాళ్లు.. ఎవరికి ఎలా నష్టం జరిగిందో తెలుసని వెల్లడించారు. రాయలసీమ ప్రాజెక్టులు చూస్తే ఎన్టీఆర్, చంద్రబాబు గుర్తు వస్తారని మంత్రి నిమ్మల పేర్కొన్నారు.
Read Also: Suresh Kumar C : టాలీవుడ్ నటుడు ఆకస్మిక మృతి
ఇక, జూన్ నుంచి డిసెంబర్ వరకు నీటిని ఉపయోగించుకున్నా, 79 శాతం నీరు ఇంకా రాయలసీమలో నిల్వ ఉందని నిమ్మల రామానాయుడు తెలిపారు. శ్రీకృష్ణదేవ రాయలు కాలంలో మా చెరువులు కళకళ లాడాయి.. మళ్ళీ ఇప్పుడు ఆ పరిస్థితి ఉందని రాయలసీమ వాసులు చెబుతున్నారు.. రాయలసీమ బిడ్డా అని చెప్పుకుంటూ కనీసం ఒక్క పంపు ఉపయోగించలేదన్నారు. ఐదేళ్లలో హంద్రీనీవా బిల్లులు ఎగ్గొట్టారని విమర్శించారు. ఐదేళ్లలో హంద్రీనీవాకు వైసీపీ చేయని పనులు ఒక్క ఏడాదిలోనే చంద్రబాబు చేశారని పేర్కొన్నారు. జగన్ హయంలో హంద్రీనీవాకు 514 కోట్లు ఇచ్చారు.. కూటమి సర్కార్ ఏడాదిన్నరలో రూ. 3148 కోట్లు ఇచ్చిందని చెప్పారు. జగన్ హయాంలో ఐదేళ్లలో రాయలసీమ ప్రాజెక్టులు నిర్లక్ష్యానికి గురి అయ్యాయని మంత్రి నిమ్మల వెల్లడించారు.
అయితే, జగన్ ప్రభుత్వంలో అన్నమయ్య ప్రాజెక్టులో ఇసుక దోపిడీ ఏ విధంగా జరిగిందో అందరు చూశారని మంత్రి రామానాయుడు పేర్కొన్నారు. ఆ ప్రాజెక్ట్ కి చేసిన ద్రోహంతో గ్రామాలు కొట్టుకుపోయిన పరిస్థితితో 38 మంది వరకు చనిపోయారని ఆరోపించారు. కనీసం వారిని చూడటానికి కూడా జగన్ వెళ్ళలేదని ఎద్దేవా చేశారు. గోరకల్లులో రిజర్వాయర్ ప్రమాదంలో ఉందని అధికారులు తెలియజేస్తే ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. గోరకల్లు రిజర్వాయర్ కి ఇప్పుడు టెండర్లు పిలిచి వాటిని రిపేర్ చేయిస్తున్నామని మంత్రి నిమ్మల తెలియజేశారు.