Suresh Kumar C: టాలీవుడ్ ప్రముఖ నటుడు, బ్యాంకింగ్ రంగ నిపుణుడు , సీనియర్ పాత్రికేయుడు సి. సురేష్ కుమార్ అనారోగ్య కారణాలతో కన్నుమూశారు. మూడు దశాబ్దాలకు పైగా బ్యాంకింగ్ రంగంలో ఉన్నత స్థానాల్లో సేవలందిస్తూనే, నటనపై ఉన్న మక్కువతో రంగస్థలం నుంచి వెండితెర వరకు తనదైన ముద్ర వేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి ఆయన. సి. సురేష్ కుమార్ కేవలం నటుడు మాత్రమే కాదు, బ్యాంకింగ్ రంగంలో దిగ్గజం. దాదాపు 30 ఏళ్ల పాటు అనేక మల్టీనేషనల్ బ్యాంకులు, ఆర్థిక సంస్థలలో అత్యున్నత పదవులలో ఆయన పని చేశారు. కార్పొరేట్ ప్రపంచంలో ఎంత బిజీగా ఉన్నా, తనలోని కళాకారుడిని ఆయన ఎప్పుడూ నిద్రపోనివ్వలేదు. ముఖ్యంగా ముంబై, హైదరాబాద్ నగరాల్లోని ప్రముఖ థియేటర్ గ్రూపులలో ఆయన కీలక సభ్యుడిగా ఉండేవారు, భాషా భేదం లేకుండా ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం మరియు మరాఠీ భాషా నాటకాల్లో నటించి మెప్పించారు.
Read Also: Minister Sridhar Babu: మరోసారి దావోస్‌కు వెళ్తున్నాం.. భారీగా పెట్టుబడులు తెస్తాం..
నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా (NSD) ఢిల్లీ, జమ్మూ సహా బికనీర్ వంటి ప్రతిష్టాత్మక వేదికలపై తన ప్రదర్శనలు ఇచ్చారు, ముంబైలోని ఐకానిక్ ‘NCPA’లో కూడా ఆయన నాటకాలు ప్రదర్శితమవ్వడం విశేషం. తెలుగు, హిందీ చిత్ర పరిశ్రమలో కూడా సురేష్ కుమార్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. బిగ్ బి అమితాబ్ బచ్చన్ వంటి సూపర్ స్టార్లతో కలిసి ‘సర్కార్ రాజ్’, ‘మద్రాస్ కేఫ్’, ‘మోడ్’ వంటి చిత్రాల్లో నటించారు. అలాగే తెలుగు ప్రేక్షకులకు ఆయన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘మహానటి’, ‘గోల్కొండ హైస్కూల్’ వంటి సూపర్ హిట్ చిత్రాల ద్వారా సుపరిచితులు. కేవలం కమర్షియల్ సినిమాలే కాకుండా, ఇంగ్లీష్ మరియు తమిళ భాషల్లో పలు ఆర్ట్ ఫిలిమ్స్ లో కూడా నటించి తన నటనలోని వైవిధ్యాన్ని చాటుకున్నారు.