ఏపీ మంత్రి కొడాలి నాని మరోసారి చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. దొంగే దొంగ అంటే ప్రజలు నమ్ముతారనే భ్రమలో చంద్రబాబు ఉంటాడని మంత్రి కొడాలి నాని ఆరోపించారు. ఏపీకి ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టి ప్రత్యేక ప్యాకేజీ తెచ్చుకున్న దుర్మార్గుడు చంద్రబాబు అని వ్యాఖ్యానించారు. ప్యాకేజీ వద్దు ప్రత్యేక హోదానే కావాలని ఉద్యమం చేసిన వ్యక్తి జగన్ అని కొనియాడారు. జీవీఎల్ నరసింహారావు పక్క రాష్ట్రంలో ఎంపీ పదవి తెచ్చుకున్న వ్యక్తి అని.. పదిహేను రోజులకు ఒకసారి ఇక్కడకు వచ్చి ప్రెస్‌మీట్‌లు పెట్టి వెళ్తుంటాడని కొడాలి నాని ఎద్దేవా చేశారు.
ప్రత్యేకహోదా ముగిసిపోయిన అంశం అయితే ఆ కాగితం ఇంకా కేంద్ర హోంశాఖ టేబుల్‌పై ఎందుకు ఉందని మంత్రి కొడాలి నాని ప్రశ్నించారు. రాష్ట్రానికి అన్యాయం జరిగిందని స్వయంగా ప్రధానే చెప్పారని.. తాము చేస్తున్న పోరాటం వల్లే ప్రత్యేక హోదా అంశం ఇంకా లైవ్‌లో ఉందన్నారు. నిన్నటి వరకు డీజీపీ వైసీపీ కండువా కప్పుకున్నాడని చంద్రబాబు విమర్శించాడని.. సమర్ధవంతంగా పని చేయబట్టే ఇవాళ ఆయన్ను బదిలీ చేశారని చెబుతున్నాడని.. ఇటువంటి చవట మాటలు చెప్పబట్టే టీడీపీని, లోకేష్‌ను ప్రజలు ఓడించారని కొడాలి నాని విమర్శించారు.