Jogi Ramesh: చంద్రబాబు అధికార దాహం, ప్రచార పిచ్చి వల్లే అమాయక ప్రజల మరణాలు సంభవిస్తున్నాయని విమర్శించారు ఆంధ్రప్రదేశ్ మంత్రి జోగి రమేష్.. చంద్రబాబు 40 ఏళ్ల ఇండస్ట్రీలో 40 మందిని పొట్టన పెట్టుకున్నాడని మండిపడ్డారు.. ఇంత మంది మరణాలకు కారణం అయిన చంద్రబాబుపై అసలు ఎందుకు చర్యలు తీసుకోకూడదు? అని నిలదీశారు.. గుంటూరులో తొక్కిసలాట ఘటనపై ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన మంత్రి జోగి రమేష్.. చంద్రబాబును అరెస్టు చేస్తామని ప్రకటించారు. ఇక, చంద్రబాబు డైరెక్షన్‌లోనే ఉయ్యూరు ఫౌండేషన్ కార్యక్రమం నిర్వహించారని తెలిపారు.. ఉయ్యూరు ఫౌండేషన్ లాంటి చంద్రబాబు మసాలా ఫౌండేషన్ లపై విచారణ చేస్తామని వెల్లడించారు. మరోవైపు.. చంద్రబాబును డీజీపీ కట్టడి చేయాల్సిందే నని సూచించారు మంత్రి జోగి రమేష్.
కాగా, గుంటూరులో టీడీపీ నిర్వహించిన ఎన్టీఆర్ జనతా వస్త్రాలు, చంద్రన్న కానుక పంపిణీలో తొక్కిసలాట చోటుచేసుకుంది. వికాస్‌నగర్‌లో ఉయ్యూరు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జనతా వస్త్రాలు, చంద్రన్న కానుక పంపిణీ చేపట్టగా.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చంద్రబాబు మాట్లాడి వెళ్లిపోయిన తర్వాత కానుకల పంపిణీ చేపట్టారు. చంద్రన్న కానుకల కోసం జనం ఒక్కసారి తోసుకురావడంతో తొక్కిసలాట జరిగింది. దీంతో ముగ్గురు మృతి చెందారు. పలువురు అస్వస్థతకు గురైయ్యారు.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కందుకూరులో ఎనిమిది మంది మృతిచెందిన ఘటన మరువకముందే.. గుంటూరులో ఈ ఘటన జరగడంతో.. టీడీపీ, పార్టీ అధినేత చంద్రబాబును టార్గెట్ చేస్తోంది అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.