Jogi Ramesh: గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం ఇప్పటంలో వైసీపీ సర్కారుపై పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలపై మంత్రి జోగి రమేష్ స్పందించారు. పిచ్చి కళ్యాణ్ పిచ్చి కూతలు కూశాడని.. జనవరి నెలలోనే ఇప్పటం గ్రామంలో రోడ్ల విస్తరణ కోసం అధికారులు పనులు ప్రారంభించారని.. ఇప్పటివరకు ఒక్క ఇల్లు కూడా కూల్చలేదని స్పష్టం చేశారు. ఇప్పటంలో అభివృద్ధి జరుగుతుంటే పవన్ ఎందుకు అడ్డుకుంటున్నాడో తెలియడంలేదని మండిపడ్డారు. ప్రహరీగోడలు మాత్రమే తొలగించారని.. దీనికే పవన్ ప్రజలను రెచ్చగొడుతున్నాడని జోగి రమేష్ ఆరోపించారు. రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా వైఎస్ఆర్ విగ్రహం కూడా తొలగించారని పేర్కొన్నారు.
Read Also: President Murmu Dance : సీఎం భార్యతో స్టేజ్ పైన స్టెప్పులేసిన రాష్ట్రపతి
పవన్ కళ్యాణ్ గతంలో ఇప్పటం గ్రామానికి రూ.50 లక్షలు ఇస్తానని చెప్పాడని.. ఇప్పటివరకు రూపాయి ఇవ్వలేదని మంత్రి జోగిరమేష్ విమర్శలు చేశారు. పవన్‌పై ఎలాంటి రెక్కీ జరగలేదని తెలంగాణ పోలీసులు స్పష్టంగా స్టేట్‌మెంట్ ఇచ్చారని.. కొంత మంది తాగుబోతులు చేసిన గొడవ అని తెలంగాణ పోలీసులు చెప్పిన తర్వాత కూడా రెక్కీ అని చెప్పటానికి పవన్‌కు సిగ్గు ఉందా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూల్చివేతల గురించి మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబుకు లేదన్నారు. వేల ఇళ్ళనే కాదు చివరికి దేవాలయాలను, మహాత్మా గాంధీ విగ్రహాన్ని సైతం కూల్చేసిన చరిత్ర చంద్రబాబుది అన్నారు. అందుకే ప్రజలు చంద్రబాబు ప్రభుత్వాన్ని కూల్చివేశారని ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్‌ను రెండు చోట్లా ఓడించారని.. అయినా వీళ్లిద్దరికీ సిగ్గు రావడం లేదన్నారు. పవన్ కళ్యాణ్ పిరికి సన్నాసి అని.. దమ్ము, ధైర్యం ఉంటే తాను ఒక్కడినే 175 స్థానాల్లో పోటీ చేస్తానని ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. నిజంగా దమ్ముంటే తానే ముఖ్యమంత్రి అభ్యర్థి అని పవన్ ప్రకటన చేయాలన్నారు. వీక్‌డేస్‌లో సినిమా షూటింగులు, వీకెండ్‌లో రాజకీయ డ్రామాలను పవన్ ఆడుతున్నాడని ఆరోపించారు.