Gudivada Amarnath: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై మంత్రి గుడివాడ అమర్నాథ్ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్ 175 నియోజకవర్గాల పేర్లు చెప్పగలిగితే తాను అన్నీ వదులుకుని ఎక్కడికైనా వెళ్లిపోయేందుకు సిద్ధంగా ఉన్నట్లు సవాల్ విసిరారు. జగన్ సీఎం కాడని గత ఎన్నికల ముందు చెప్పాడని.. కానీ ఏమైందో అందరూ చూశారని.. ఇప్పుడు కూడా వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలవదని చెప్తున్నాడని.. మళ్లీ వైసీపీ గెలిచి తీరుతుందని మంత్రి గుడివాడ అమర్నాథ్ జోస్యం చెప్పారు. 175 స్థానాల్లో ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తారో పవన్ కళ్యాణ్ చెప్పగలడా అని ఆయన ప్రశ్నించారు. కనీసం పవన్ కళ్యాణ్ అయిన ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారో చెప్పగలుగుతారా అని నిలదీశారు.
Read Also: Pawan Kalyan: పిఠాపురమా? భీమవరమా? పవర్ స్టార్ పోటీ ఎక్కడ?
మరోవైపు అమరావతి రాజధాని అన్నది ఓ స్కాం అని మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. అమరావతి రైతులు ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకోవాలన్నారు. టీడీపీ వాళ్లు అమరావతి రైతులు బెదిరించి భూములను లాక్కున్నారని ఆయన విమర్శలు చేశారు. మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్న జగన్ ఆకాంక్షను ఎవరూ అడ్డుకోలేరని.. ఈరోజు సుప్రీంకోర్టు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసిందని సంతోషం వ్యక్తం చేశారు. అమరావతి ప్రాంతం నుంచి విజయవాడకు వెళ్లాలన్నా 40 కిలోమీటర్లు, గుంటూరు వెళ్లాలన్నా 40 కిలోమీటర్లు, ఎయిర్‌పోర్టుకు వెళ్లాలంటే 50 కి.మీ వెళ్లాలని.. ఇది ఆమోదయోగ్యం కాదన్నారు. అలాగని అమరావతి అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. హైకోర్టు న్యాయమూర్తులను బదిలీ చేస్తే ధర్నాలు చేయడం ఎప్పుడైనా చూశామా అని ప్రశ్నించారు. ఇటువంటి పరిస్థితులు ప్రజాస్వామ్యానికి ఇబ్బందికరమని అభిప్రాయపడ్డారు. సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నిరసనలు చేయడం దురదృష్టకరమని.. దీనిపై ప్రజల్లో చర్చ జరగాలని మంత్రి గుడివాడ అమర్నాథ్ సూచించారు. రాజధాని అంటే జేబులు నింపుకునే కార్యక్రమం అని టీడీపీ భావించిందని.. అందుకే ఆ పార్టీని గత ఎన్నికల్లో తిప్పికొట్టారని విమర్శలు చేశారు.