సామాజిక న్యాయభేరి బస్సు యాత్ర ఏర్పాట్లపై శ్రీకాకుళం జిల్లా వైసీపీ నేతలతో మంత్రి బొత్స సత్యనారాయణ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల జెడ్పీ ఛైర్మన్‌లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి బొత్స మాట్లాడుతూ.. ఏపీలో ఈనెల 26 నుంచి 29 వరకు సామాజిక న్యాయభేరి బస్సు యాత్ర చేపడుతున్నట్లు తెలిపారు. సీఎంగా జగన్ బాధ్యతలు తీసుకున్న తర్వాత అన్ని వర్గాల వారికి సముచిత స్థానం కల్పించారన్నారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 70 శాతం మంత్రులుగా ఎస్సీ, ఎస్టీ, బలహీన వర్గాల వారికి అవకాశం ఇచ్చారని కొనియాడారు. నామినేటేడ్ పదవుల్లో సైతం 50 శాతం బలహీన వర్గాలకు ఇచ్చారని గుర్తుచేశారు. ఈ అంశాలను ప్రజలకు తెలియజేసేందుకు బస్సు యాత్ర చేపడుతున్నట్లు బొత్స వివరించారు.
రాష్ట్రంలో అన్ని వర్గాల వారికి సమన్యాయం జరిగేలా వారిని ఆదుకుంటున్నట్లు మంత్రి బొత్స వెల్లడించారు. లోకేష్‌కు తెలిసింది తక్కువ.. మాట్లాడేది ఎక్కువ అని ఎద్దేవా చేశారు. మోకు, సుత్తి, కొడవలి ఇస్తే బీసీలను అక్కున చేర్చుకున్నట్లా అని ప్రశ్నించారు. లోకేష్, చంద్రబాబు బీసీలకు ఇది చేశామని ఒక్కటైనా చెప్పగలరా అని బొత్స నిలదీశారు. మరోసారి మోసం చేయడానికి చంద్రబాబు ప్రజల ముందుకు వస్తున్నారని ఆరోపించారు. అసలు చంద్రబాబు ఆంధ్రావారా, తెలంగాణ వారా చెప్పాలన్నారు. ఏపీలో పర్మినెంట్ అడ్రస్ లేని వ్యక్తి చంద్రబాబు అని మండిపడ్డారు.
తెలంగాణలో ఉత్తరాంధ్ర కులాల బీసీ కేటగిరీ కోసం తాము ప్రయత్నించామని.. కానీ పని అవ్వలేదన్నారు. తన కులాన్ని సైతం బీసీ కేటగిరి నుంచి తీసివేశారని బొత్స తెలిపారు. తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్ణయం.. అక్కడి ప్రభుత్వ విధానం అలా ఉన్నాయని బొత్స ఆరోపించారు. మన ప్రజలే అక్కడి ప్రభుత్వానికి సమాధానం చెప్తారన్నారు. పెట్రోల్ ధరలపై కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయని మంత్రి బొత్స అన్నారు. 2019 నాటి పెట్రోల్ ధరలతో ఇప్పటి పెట్రోల్ ధరలను ప్రజలు పోల్చాలన్నారు. 40 శాతం రేట్లు పెంచి 2 శాతం తగ్గించి ఊకదంపుడు ప్రచారం చేసుకుంటున్నారని బొత్స విమర్శలు చేశారు.
శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్‌కు దశాబ్దాలుగా ఎన్నికలు జరగలేదని.. ఎన్నికలను కొన్ని దుష్టశక్తులు అడ్డుకుంటున్నాయని బొత్స ఆరోపించారు. డ్రైవర్ సుబ్రమణ్యం మృతి కేసులో ఎమ్మెల్సీపై కేసు పెట్టామని.. ఈ కేసును పోలీసులు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేస్తున్నారని బొత్స తెలిపారు. తప్పుచేయలేదనే సెల్ఫ్ కాన్ఫిడెన్స్‌తో ఎమ్మెల్సీ తిరిగి ఉండొచ్చని.. తమ ప్రభుత్వంలో ఎవరూ చట్టానికి చుట్టాలు కారని గుర్తుపెట్టుకోవాలని బొత్స పేర్కొన్నారు. బాధితులకు న్యాయం జరుగుతుందని ఆయన హామీ ఇచ్చారు.