Botsa Satyanarayana: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల వేదికగా ప్రతిపక్ష టీడీపీ సభ్యులకు బహిరంగ సవాల్ విసిరారు మంత్రి బొత్స సత్యనారాయణ.. ప్రశ్నోత్తరాల సమయంలో కీలక వ్యాఖ్యలు చేశారు.. విద్యా రంగంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ర్యాంకు 29కి పడిపోయిందని తెలుగుదేశం పార్టీ సభ్యులు ఆరోపించారు.. అయితే, టీడీపీ ఆరోపణలను ఖండించిన మంత్రి బొత్స… నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తాను అంటూ ప్రకటించారు.. రాష్ట్రంలో పాఠశాలలు మూతపడ్డాయన్న టీడీపీ ఎమ్మెల్యే డోలా వీరాంజనేయులు వ్యాఖ్యలను ఖండించిన బొత్స సత్యనారాయణ.. మీ నియోజకవర్గంలో మూతపడిన ఒక్క పాఠశాల పేరైనా చెప్పాలంటూ సవాల్ చేశారు.. కానీ, ఈ విషయంపై డోలా వీరాంజనేయులు ఎలాంటి సమాధానం చెప్పలేకపోయారు.. దీనిపై స్పందించిన మంత్రి.. అనవసరమైన, ఆధారాలు లేని ఆరోపణలు చేయడం సరైన విధానం కాదని హితవుపలికారు.. కాగా, ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు మంగళవారం రోజు ప్రారంభం అయ్యాయి.. తొలిరోజు ఉభసభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు.. రేపు అనగా గురువారం రోజు అసెంబ్లీలో బడ్జెట్ 2023-24 బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి.