ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని ప్రభుత్వ స్కూళ్లను మూసివేసేందుకు వైసీపీ సర్కార్ ప్రయత్నాలు చేస్తుందంటూ విపక్షాలు ఆరోపిస్తున్నాయి.. దీనిపై స్పందించిన మంత్రి బొత్స సత్యనారాయణ.. రాష్ట్రంలో ఒక్క స్కూల్ కూడా మూసివేసే ప్రసక్తే లేదని క్లారిటీ ఇచ్చారు.. తాడేపల్లిలో ఇవాళ మీడియాతో మాట్లాడిన విద్యాశాఖ మంత్రి.. రాష్ట్రంలో మొదటి సారి విద్యారంగంలో సంస్కరణలు జరుగుతున్నాయని, అవి కూడా విద్యా హక్కు చట్టం ప్రకారం జరుగుతున్నాయని తెలిపారు.. స్కూళ్లు మూసేస్తున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డ ఆయన.. బడి మాయమవటానికి అది ఏమైనా ఎడ్ల బండా… తోపుడు బండా..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఇక, కొన్ని మీడియాల్లో వచ్చిందే చంద్రబాబు మాట్లాడుతారంటూ ఎద్దేవా చేశారు బొత్స.
Read Also: Chandrababu Ring: చంద్రబాబు వేలికి రింగ్.. ఇంత సీక్రెట్ ఉందా..?
మరోవైపు, అమ్మ ఒడి పథకాన్ని పనికి మాలిందిగా చెప్పిన ఏకైక వ్యక్తి చంద్రబాబు అని ఫైర్ అయ్యారు మంత్రి బొత్స.. ఈ పథకం వల్ల ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని చంద్రబాబు కడుపు మంట అని ఎద్దేవా చేసిన ఆయన.. రాష్ట్రంలో 42,750 స్కూళ్లు ఉన్నాయి.. 5,200 స్కూళ్లు మ్యాపింగ్ చేశాం, 200 స్కూళ్లు రెండు కిలో మీటర్ల రేడియస్‌లో ఉన్నాయని తెలిపారు.. ఒక క్లాస్ కు ఒక టీచర్ కాకుండా కేంద్ర సిలబస్ ప్రకారం సబ్జెక్ట్‌కు ఒక టీచర్ విధానం తీసుకుని వస్తున్నామని వెల్లడించారు.. రాష్ట్రంలో ఒక్క స్కూల్ కూడా మూసివేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ.
