BC Janardhan Reddy: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రహదారుల ఆస్తుల నిర్వహణ విధానం అమలులో సంస్థాపరంగా వచ్చే సమస్యలు ఎదుర్కొనే తీరుని పరిశీలించేందుకు రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర ఉన్నత స్థాయి ప్రతినిధుల బృందం అస్సాంలో పర్యటించనుంది. గత 5 ఏళ్లుగా రాష్ట్రంలో గతుకుల, గుంతల రోడ్లతో ప్రజలు పడిన అవస్థలను దృష్టిలో ఉంచుకుని మెరుగైన రోడ్ల ఏర్పాటే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అందుకనుగుణంగా రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధి & నిర్వహణ, మౌలిక సదుపాయాల కల్పనలో భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని దేశ వ్యాప్తంగా అమలవుతున్న నూతన విధానాలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది.
ఇక, రేపటి నుంచి రెండు రోజుల పాటు అస్సాంలో వివిధ ప్రాంతాలను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలోని ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం సందర్శించనుంది. ముఖ్యంగా తొలి రోజు పర్యటనలో భాగంగా అస్సాం రాష్ట్ర పబ్లిక్ వర్క్స్ డిపార్టెమెంట్ అధికారులతో ఏపీ రాష్ట్ర ఉన్నత స్థాయి ప్రతినిధుల బృందం భేటీ కానుంది. ఈ సమావేశంలో అస్సాంలో రహదారుల ఆస్తుల నిర్వహణ విధానం అమలులో అనుభవాలు, సమస్యలను ఎదుర్కొన్న తీరుపై అధికారులతో చర్చించనుంది. అలాగే, గత రెండు దశాబ్దాలుగా అస్సాం రాష్ట్ర పబ్లిక్ వర్క్స్ డిపార్ట్ మెంట్ లో వచ్చిన మార్పులపై సైతం రాష్ట్ర ఉన్నతస్థాయి ప్రతినిధుల బృందం చర్చించనుంది.
Read Also: Minister Seethakka: మాజీ మహిళా మంత్రుల చరిత్ర.. ఇప్పటి మహిళా మంత్రుల చరిత్ర ప్రజలకు తెలుసు
అలాగే, తొలి రోజు అస్సాంలో ఆల్ఫ్రోస్కో గ్రాండ్ లో బ్రహ్మపుత్ర క్రూయిజ్, రాజధాని గౌహతి – పంబ బజార్ లో బ్రహ్మపుత్ర రివర్ ఫ్రంట్ లను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలోని టీమ్ పరిశీలించనుంది. ఇక, రెండో రోజు అస్సాం పర్యటనలో భాగంగా తొలుత అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన కామాఖ్య అమ్మవారి దేవాలయాన్ని ఈ ఉన్నతస్థాయి ప్రతినిధుల బృందం సందర్శించనుంది. దీంతో పాటు అస్సోంలో బ్రహ్మపుత్ర నదిపై నిర్మాణంలో ఉన్న గౌహతి – ఉత్తర గౌహతి వంతెనను కూడా ఈ బృందం సందర్శిచే అవకాశం ఉంది. రోడ్డు ఆస్తుల నిర్వహణ విధానంపై ప్రత్యక్ష డేటా సేకరణపై ప్రదర్శన కోసం అస్సాం మాల కారిడార్ లోని “పలాష్‌బరి మీర్జా చందుబీ రోడ్” కూడా సందర్శించనుంది. ఆ తర్వాత ఉన్నత స్థాయి బృందం తిరిగి రాష్ట్రానికి రానుంది.