Ambati Rambabu: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పోలవరం ప్రాజెక్టు ఎత్తుపై రకరకాల ప్రచారం సాగుతోంది.. ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తున్నారని కొందరు? యథావిథంగా ఉంటుందని మరికొందరు చెబుతున్న మాట.. అయితే, పోలవరం ప్రాజెక్టుపై వస్తున్న విమర్శలను తిప్పికొడుతూ.. ప్రాజెక్టు ఎత్తుపై క్లారిటీ ఇచ్చారు రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు.. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. పోలవరం ఎత్తు తగ్గిస్తామని అధికారులు సంతకాలు పెట్టారని జనసేన నేత నాదెండ్ల మనోహర్ చెప్పాడు.. ఇలా పచ్చి అబద్ధాలు మాట్లాడటానికి బుద్ధి, జ్ఞానం ఉందా? అంటూ మండిపడ్డారు. ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా నాదెండ్ల మనోహర్ వ్యవహరిస్తున్నారని ఆరోపించిన ఆయన.. రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రిగా నేను సవాల్ చేస్తున్నాను.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి స్వయంగా అసెంబ్లీ వేదికపైనే చెప్పారు.. పోలవరం ఎత్తు తగ్గించే ప్రసక్తే లేదని అని గుర్తుచేశారు.
Read Also: Margani Bharat: పవన్ 2 రోజులు కనబడితే 3 రోజులు కనిపించరు.. ఢిల్లీకి పిలిచారా? ఆయనే వెళ్లారా..?
పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్లు 41.15కు ఎత్తు కుదించారన్నది పచ్చి అబద్ధం అని తిప్పికొట్టారు అంబటి రాంబాబు.. అధికారులు సంతకాలు చేశారని చేసిన తన వ్యాఖ్యలను నాదెండ్ల నిరూపిస్తే నేనే స్వయంగా పోలవరం ప్రాజెక్టు దగ్గరకు తీసుకుని వెళ్తానన్నారు.. గొడవ చేయటానికి వెళ్తే పోలవరం ప్రాజెక్టు దగ్గరకు ఎందుకు అనుమతిస్తాం? అని ప్రశ్నించారు. ఇంతకు ముందు చంద్రబాబు రాత్రి ఏడు గంటలకు పోలవరం ప్రాజెక్టు దగ్గరకు వెళ్ళి గొడవ చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. డయాఫ్రమ్ వాల్ డ్యామేజ్ అయిన విషయం తెలియకే 2022 డిసెంబర్ నాటికి పోలవరం పూర్తి చేస్తామని.. గతంలో ఇరిగేషన్ శాఖా మంత్రిగా ఉన్న అనిల్ కుమార్ యాదవ్ ప్రకటించారని పేర్కొన్నారు మంత్రి అంబటి రాంబాబు.
కాగా, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయడంలో ప్రజలను జగన్ సర్కార్ మోసం చేస్తోందని జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆరోపించిన విషయం విదితమే.. ప్రాజెక్టును పూర్తి చేయాలన్న చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి లేదన్న ఆయన.. కేవలం రాజకీయంగా బురద జల్లేందుకు ప్రాజెక్టు అంశాన్ని వాడుకుంటున్నారనే విషయం కేంద్ర మంత్రి షెకావత్‌తో సమావేశం సందర్భంగా తెలిసి అవాక్కయ్యామన్నారు. ఇక, త్వరలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోలవరంలో పర్యటిస్తారని ప్రకటించిన ఆయన.. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి, అరాచకాలు, రాజ్యాంగ ఉల్లంఘనలు, శాంతి భద్రతలు క్షీణించడం వంటి విషయాలను.. పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటనలో బీజేపీ పెద్దల దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిపిన విషయం తెలిసిందే.