2019లో జగన్ సీఎం అయ్యాక రెండున్నరేళ్ల అనంతరం కేబినెట్ పునర్‌వ్యవస్థీకరణ చేస్తానని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈరోజు ఏపీ కేబినెట్ చివరి సమావేశం జరుగుతోంది. మంత్రులకు ఇదే చివరి సమావేశం. ఈ సందర్భంగా విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఎన్టీవీతో ప్రత్యేకంగా ముచ్చటించారు. సీఎం జగన్‌వి ఉన్నత ప్రమాణాలు అని ప్రశంసించారు. సీఎం జగన్ లక్ష్యాలకు అనుగుణంగా పని చేయటానికి శాయశక్తులా పని చేశానని మంత్రి సురేష్ తెలిపారు. విద్యాశాఖ మంత్రిగా సీఎం తనకు గొప్ప అవకాశం ఇచ్చారన్నారు.
సీఎం జగన్ నేతృత్వంలో పని చేయటం తనకు గొప్ప అనుభవమని మంత్రి సురేష్ తెలిపారు. ముఖ్యమంత్రి కోసం తన తల కోసుకోవటానికి కూడా సిద్ధమన్నారు. పేదరికం విద్యకు అడ్డు కాకూడదనే విధానం సీఎం జగన్‌ది అని పేర్కొన్నారు. గత పాలకులు విద్యను కార్పొటీకరణ చేయటానికి ప్రయత్నం చేశారని ఆరోపించారు. విద్యారంగంలో సమూల మార్పులకు సీఎం జగన్ అనేక కార్యక్రమాలు చేపట్టారన్నారు. ఈ మూడేళ్లలో విద్యా రంగంపై 76 సమీక్షలు సీఎం చేపట్టారన్నారు. ఏ బాధ్యత ఇచ్చినా మరింత ఉత్సాహంగా పని చేస్తానని మంత్రి సురేష్ స్పష్టం చేశారు.
మరోవైపు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా ఎన్టీవీ ప్రతినిధితో మాట్లాడారు. ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడే 90 శాతం మంత్రులను మారుస్తామని సీఎం జగన్ చెప్పారన్నారు. ఆ ప్రక్రియ ఇప్పుడు ప్రారంభం అయ్యిందన్నారు. ముఖ్యమంత్రి అన్నీ ఆలోచించే ఈ నిర్ణయం తీసుకుని ఉంటారని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఈ మూడేళ్లలో తాను సంతృప్తికరంగా పని చేశానని పేర్కొన్నారు. సీఎం జగన్ ఇచ్చిన పనిని సమర్ధవంతంగా నిర్వర్తించటమే తన కర్తవ్యమన్నారు. పార్టీ బాధ్యతనా, ప్రభుత్వంలో కొనసాగింపు ఉంటుందా అన్నది సీఎం నిర్ణయమన్నారు. ప్రభుత్వంపై ఎటువంటి ఆరోపణలు చేయలేక ప్రతిపక్ష పార్టీలు మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేశాయని ఆరోపించారు. వాటిని తాము సమర్ధవంతంగా తిప్పికొట్టగలిగామని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు.
https://ntvtelugu.com/cm-jagan-hold-cabinet-meeting-before-cabinet-reshuffle/