ఉమ్మడి గుంటూరు జిల్లాలో మైనింగ్ గ్యాంగ్ రెచ్చిపోతోంది. పగలు రాత్రి తేడా లేకుండా ఇష్టానుసారంగా ఎక్కడపడితే అక్కడ మట్టితవ్వేస్తూ దోచుకుంటున్నారు మైనింగ్ మాఫియా. అదేమని అడిగితే పట్టించుకునే నాథుడు లేడు. అడిగితే అధికారులను కూడా భయపెట్టే స్థాయికి బెదిరింపులతో మట్టి మాఫియా మాట్లాడుతుండటంతో వారికి అధికారపార్టీలో కొంతమంది మద్దతు ఉందని ప్రచారం జరగటంతో అధికారులు కూడా ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. ప్రత్తిపాడు,పొన్నూరు, పెదకూరపాడు, వినుకొండ నియోకవర్గాల్లో రాత్రి అయితేచాలు ట్రాక్టర్లు లారీలు ప్రొక్లైనర్ల రీ సౌండ్ తో ప్రజలు ఉలిక్కిపడుతున్నారు.
ఉమ్మడి గుంటూరు జిల్లాలో మట్టి మాఫియా చెలరేగిపోతున్నారు. రాత్రి అయ్యిందంటే వందలకొద్దీ ట్రాక్టర్లు లారీలు సాయం తో గ్రామాల్లో మట్టి తవ్వేస్తున్నారు …ఏదో ఒక ఒక సర్వే నెంబర్ తో కొద్దిపాటి మట్టి మెరక తీసుకుంటామని స్థానిక రెవెన్యూ అధికారుల వద్ద అనుమతులు తెచ్చుకోవడం ఇక అదే అదునుగా వందల ట్రాక్టర్లు లారీలు పెట్టి భారీ ప్రక్రియలతో మట్టి మాయం చేస్తున్నారు. ఇది ఏ ఒక్క పంచాయతీ కో ఏ ఒక గ్రామానికి సంబంధించిన అంశం కాదు. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని 17 నియోజకవర్గాల్లో దాదాపు సగం చోట్ల ఇదే పని. ట్రాక్టర్ లు , లారీలు గ్రామాల్లో విపరీతమైన సౌండ్ తో మట్టి దోచేయడం ఒక పనిగా మారింది. అదేమని అడిగితే గ్రామస్థులను బెదిరించి ఫలానా వర్గం కాబట్టి నువ్వు మా మీద ఫిర్యాదు చేస్తున్నావ్..అధికారులకు సమాచారం ఇచ్చి పంపుతుంది నువ్వే నా అంటూ ఘర్షణకు దిగుతున్నారు.
అధికారులను చుట్టుముట్టి బెదిరింపులకు పాల్పడుతున్నారు మాఫియా. ప్రత్తిపాడు నియోజకవర్గంలోని వట్టిచెరుకూరు మండలం, కాకుమాను మండలం, వినుకొండ, పొన్నూరు, చేబ్రోలు, అమరావతి, క్రోసురు మండలాల్లో రాత్రిపూట యథేచ్ఛగా అక్రమ మైనింగ్ జరుగుతున్నట్లు సమాచారం. ప్రత్తిపాడు నియోజక వర్గంలో గత రాత్రి అక్రమ మైనింగ్ సమాచారంతో పోలీసులు అక్కడికి వెళ్లారు. అయితే అక్కడికి చేరుకున్న పోలీసులను మైనింగ్ మాఫియా దాదాపు కొట్టినంత పని చేసిందని సమాచారం.
ప్రతిసారి మా పని కి ఎందుకు అడ్డం వస్తున్నారు అంటూ మూకుమ్మడి దాడి చేయడంతో పోలీసులు ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో వెనుదిరిగి వెళ్లిపోయారు. అయితే ఏంటి మమ్మల్ని చంపుతారా? ఎందుకు నా మీద ఇలా దాడి చేస్తున్నారు అని ఆవేదన చెందుతూ మరి అక్కడి నుంచి ఓ ఎస్ ఐ వెళ్లిపోయారు. రాత్రిపూట మట్టి తవ్వకాలు చేయకూడదని నిబంధనలు ఉన్నా ఆచరణలో మాత్రం అవి అమలు కావడంలేదని ఆరోపణలు ఉన్నాయి. వాస్తవానికి చెరువు పూడిక తీయటానికి లేదా చెరువు కరకట్టలు పటిష్ట పరచడానికి సమీపంలో ఉన్న పొలాల నుండి కొద్దిగా మట్టి తీసుకొని పనులు చేసుకోవచ్చు. కానీ గ్రామాల్లో ఉన్న ఏదో ఒక సర్వే నంబర్ నుండి అనుమతులు తీసుకుని పొలంలో పూడిక తీయాలంటూ రెవెన్యూ అధికారులకు అర్జీ పెట్టుకొని అక్కడినుంచి నామమాత్రపు అనుమతులు పొంది ఇష్టారాజ్యంగా మట్టి మాఫియా ప్రవర్తిస్తుంది.
కొన్ని ప్రాంతాల్లో అయితే ఎక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయో చూసుకొని ఆ ప్రభుత్వంలోని యథేచ్ఛగా మట్టి మాఫియా భూములను తవ్వేస్తుంది. ఉదయం 8 గంటల నుంచి రాత్రి ఆరు గంటల వరకు మాత్రమే ఈ పొలాల్లో మట్టి తవ్వకాలు ఉండాలి. అది కూడా రెవెన్యూ మైనింగ్ ఇరిగేషన్ అధికారుల పర్యవేక్షణలో జరపాల్సిన మట్టి తవ్వకాలు రాత్రిపూట ఇష్టారాజ్యంగా తవ్వేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో గ్రామాల్లో ఉన్న రెవెన్యూ సిబ్బంది చిన్న చిన్న లాలూచీ లకు సిద్ధపడి గ్రామాల్లో ఇష్టారాజ్యంగా మైనింగ్ మాఫియా రెచ్చిపోతున్నా పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారు. అధికారులు తనిఖీలకు వచ్చినా మైనింగ్ మాఫియా జాగ్రత్త పడుతుందన్న సమాచారం ఉంది.
Jagga Reddy: తెలంగాణ రైతులపై కేసీఆర్‌ది సవతి తల్లి ప్రేమ