సీఎం కేసీఆర్ తెలంగాణపై సవతి తల్లి ప్రేమ కురిపిస్తున్నారంటూ సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మండిపడ్డారు. కాంగ్రెప్ పార్టీ ఏం చేసిందని టీఆర్ఎస్ నాయకులు పదేపదే అడుగుతున్నారని చెప్పిన ఆయన.. ఈ 8 ఏళ్ల పాలనలో కేసీఆర్ ఏం చేశారని ప్రశ్నించారు. ఇప్పటివరకు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని, రైతులకు రుణమాఫీ కూడా చేయలేదని ఆరోపించారు. లక్షల రూపాయలు రుణమాఫీ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని అన్నారు. అప్పట్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే.. మొదటి సంతకం చేసింది ఉచిత విద్యుత్ ఫేల్ మీదనే అని గుర్తు చేసుకున్నారు. మొదటగా ఉచిత విద్యుత్ ఇచ్చిందే కాంగ్రెస్ ప్రభుత్వమని, అదే కాన్సెప్ట్‌ను టీఆర్ఎస్ కొనసాగిస్తోందని చెప్పారు.
తెలంగాణ రైతుల్ని పట్టించుకోని కేసీఆర్.. ఇతర రాష్ట్రాల రైతుల సమస్యలు పట్టించుకోవడం విడ్డూరంగా ఉందని జగ్గారెడ్డి తెలిపారు. కేవలం రాజకీయాల కోసమే కేసీఆర్ పక్క రాష్ట్రాలకు వెళ్తున్నారని ఆరోపించారు. సొంత రాష్ట్రంపై సవతి తల్లి ప్రేమ ఎందుకు చూపిస్తున్నావంటూ కేసీఆర్‌ని ప్రశ్నించారు. ‘ముందు మన రైతుల కడుపు నింపి, ఆ తర్వాత ఇతర రాష్ట్రాల సమస్యల్ని పట్టించుకో’ అంటూ ఉచిత సలహా ఇచ్చారు. అంతకుముందు.. రాజ్యసభకు హెటెరో డ్రగ్స్ యజమాని పార్థసారథి రెడ్డి పేరుని కేసీఆర్ ఖరారు చేయడంపై జగ్గారెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పెద్ద స్కాం చేసిన వ్యక్తికి రాజ్యసభ సీటు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో ప్రజల జీవితాలతో ఆడుకున్న వ్యక్తికి ఇచ్చిన రాజ్యసభ టికెట్టును వెనక్కు తీసుకోవాలని జగ్గా రెడ్డి డిమాండ్ చేశారు.