కర్నూలు జిల్లాలో మామిడి దిగుబడి గణనీయంగా తగ్గిపోయింది. చెట్టుకు ఒక కాయ కూడా లేదంటే నమ్ముతారా? టన్నుల కొద్దీ మామిడి పండించిన రైతులు ఇపుడు క్వింటాళ్ల దిగుబడి కూడా లేక తల్లడిల్లిపోతున్నారు. దశాబ్దాల కాలంగా ఇంత తక్కువ దిగుబడి ఎప్పుడు చూడలేదంటున్నారు రైతులు. బంగినపల్లి మామిడికి కర్నూలు జిల్లా ప్రసిద్ధి. వందేళ్ల మామిడి తోటలు ఉన్నాయంటే బంగినపల్లి మామిడి ఈ ప్రాంతంలో ఎంతగా ప్రసిద్ధి చెందిందో స్పష్టమవుతోంది. అనేక రకాల మామిడి సాగు చేస్తున్నా అందులో బంగినపల్లి మామిడిదే అగ్రస్థానం. అయితే ఈ ఏడాది అన్ని రకాల మామిడి పూర్తిగా దిగుబడి తగ్గింది.
బనగానపల్లె, డోన్, ఓర్వకల్, బేతంచెర్ల మండలాల్లో మామిడి ఎక్కువగా సాగు చేస్తారు. బనగానపల్లెను నవాబులు పాలించే రోజుల్లో అంటే 1905-22 మధ్య నవాబ్ మీర్ గులాం ఆలీఖాన్ విదేశాలనుండి వివిధ రకాల మామిడి పండ్ల మొక్కలు తెపించి తన ఎస్టేట్ లోని అత్యదిక విస్తీర్ణంలో నాటించారు. ఒక్కో చెట్టు కు ఒక్కో గుర్తు వేస్తూ వచ్చారట. ఎలాంటి గుర్తు వేయించకుండా ఉన్న ఒక చెట్టు కు కాసిన పండ్లు అత్యంత మధురంగా ఉన్నాయట. ఆ చెట్టు పండ్లనే బే నిషాన్ అని ఆనాటి నవాబు నామకరణం చేశారు. ఈ బే నిషాన్ మామిడి పండ్లే ప్రపంచ స్థాయిలో ప్రాచూర్యం పొందాయని చెబుతారు.
బనగానపల్లె పరిసర ప్రాంతాల్లో గతంలో వందలాది ఎకరాల్లో మామిడి తోటలు ఉండేవి. పట్టణం విస్తరించడంతో , కొన్ని మామిడి తోటల్లో రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసి ఇళ్ల స్థలాలుగా మార్చేశారు. ప్రస్తుతం 450 ఎకరాల్లో, బెనిషాన్, మల్గూబా, రెడ్ పసంద్, వంటి పలు రకాల మామిడి చెట్లను తోటల్లో రైతులు సాగు చేస్తున్నారు. గత ఏడాది తో పోల్చితే ప్రస్తుతం పూర్తి స్టాయిలో దిగుబడి గణనీయంగా తగ్గిపోయిందని రైతులు వాపోతున్నారు.
ఏడాది చలి కాలం లో కూడా అకాల వర్షాలు రావడం , భూమిలో తేమ శాతం ఆరిపోకుండా ఉండటంతో ఆశించిన మేరకు మామిడి చెట్లకు పూత రాలేదు. నవంబర్ మాసంలో రావాల్సిన మామిడిపూత, ఆలస్యంగా జనవరిలో పూత రావడం తో అధిక శాతం మామిడి పూత రాలి పోయింది. కాయ పిందె దశలో కూడా రాలి పోయింది. అరకొరగా కాసిన మామిడి కాయలు కూడా, తేనె మంచి తెగుళ్లు తామర తెగుళ్లు, వైరస్ సోకడం వంటి ప్రకృతి ప్రతి కూల పరిస్థితు లన్ని కూడా మామిడి సాగు లో దిగుబడి గణ నీయం తగ్గి పోయేందుకు కారణం అయ్యాయి. తెగుళ్లు , వైరస్ ప్రభావం వల్ల కాయ సైజు కూడా గణనీయంగా తగ్గిపోయింది, గతంలో ఒక్కో మామిడి కాయ 650 నుంచి 750 గ్రాముల బరువు వరకు ఉండేది, ప్రస్తుతం పట్టుమని 500 గ్రాముల బరువు కూడా లేకుండా పోయిందని, ఇలాంటి పరిణామాలన్నీ తమను తీవ్రంగా కృంగతీసాయని రైతులు విచారం వ్యక్తం చేశారు.
మామిడు సాగుకు లక్షలాది రూపాయలు పెట్టుబడులు పెట్టారు. కొందరు మామిడి తోట లు కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నారు. మామిడి రైతుల పరిస్థితి అత్యంత దయనీయం గా మారింది. గతంలో ఒక్క బనగానపల్లె ప్రాంతం లొనే 5 నుండి 6 వేల టన్నుల మేరకు మామిడి పండ్ల దిగుబడి వచ్చెది. ఈ ఏడాది 3 వేల టన్నులు కూడా దిగుబడి రాలేదు. మామిడి తోటల్లోకి వచ్చే వ్యాపారులు కాయ సైజు తగ్గిపోవడంతో, కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపడం లేదని కొందరు రైతులు వాపోతున్నారు. మామిడి రైతుల పరిస్థితి ఇలా వుంటే బంగినపల్లి బేనిషన్ మామిడి పళ్ళ ప్రియుల పరిస్థితి మరోలా ఉంది. బేనిషన్ రుచులు ఆస్వాదించాలంటే సామాన్యుడికి సాధ్యం కాని పరిస్థితి ఏర్పడింది, ప్రస్తుతం పెరిగిన అన్ని ధరలతో పాటు మామిడి పళ్ళ ధర లను కూడా వంద కాయలు 7వేల రూపాయల వరకు వ్యాపారులు పెంచడంతో సామాన్య జనం బంగినపల్లి బేనిషన్ పండ్లు అంటే భయపడిపోయే పరిస్థితి ఏర్పడింది.
గతంలో బనగానపల్లె నుంచి, వివిధ దేశాలకు దేశం లోని పలు ప్రాంతాలకు బంగినపల్లి బేనిషన్ పండ్లు ప్రతినిత్యం తరలించేవారు ప్రస్తుతం ఆ పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు, గత 2 – 3 ఏళ్లుగా కరోనా వైరస్ ప్రభావంతో మామిడి రైతులు నష్టపోయారు. ప్రస్తుతం ప్రకృతి వైపరీత్యాల కారణంగా తీవ్ర నష్టాల ఊబిలో కూరుకు పోయిన మామిడి సాగు చేసే రైతుల పరిస్థితి కోలుకోలేని విధంగా తయారైంది. మామిడి సాగు చేసే తాము ప్రతియేటా నష్టపోవాల్సిన పరిస్థితి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం అన్ని పంటలకు పంట నష్టపరిహారం ఇస్తున్నా మామిడి సాగు చేసే రైతులకు పరిహారం లేదు.
Bandi Sanjay: అర్థరాత్రి కిడ్నాప్ చేసి తీసుకెళ్లడం ఏంటి